‘సాక్షి’కి కృతజ్ఞతలు
- ప్రాణభిక్ష పెట్టండి కథనానికి స్పందన
- సహాయం చేసిన దాతలు
- మరికొందరు సహాయం చేస్తామని ప్రకటన
మర్రిపాలెం : తమ పిల్లల ఆరోగ్యం కోసం సహాయం చేయాలని తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తికి దాతలు స్పందించారు. ఈ నెల 3న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ప్రాణభిక్ష పెట్టండి’ కథనంతో ఆర్థిక సహాయం కోసం చేసేందుకు ముందుకు వచ్చారు. మరికొందరు సహాయం చేస్తామని ప్రకటించారు.
వసుధ పౌండేషన్ రూ.10,000, శ్రీ సంపత్ వినాయక వృద్ధాశ్రమం (వనప్రస్థ) రూ.5,450, రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ మద్దిలపాలెం రూ.3,060, మరో ఎనిమిది మంది దాతల నుంచి రూ.500, రూ.1,000, రూ.2,000 ఇలా మొత్తంగా రూ.30 వేల ఆర్థిక సహాయం అందినట్టు తల్లిదండ్రులు కోటేశ్వరరావు, వరలక్ష్మి చెప్పారు. గురువారం కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఇమ్మానుయేలురాజు ద్వారా ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
ఓ కేసు విషయమై విచారణ కోసం వరలక్ష్మిని ఎస్‌ఐ సతీష్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తన పిల్లల అనారోగ్యం విషయాన్ని ఎస్‌ఐకు ఆమె తెలియజేశారు. ఆయన చొరవతో వరలక్ష్మి దంపతులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంతో దాతలు స్పందించి సహాయం చేయడాన్ని సీఐ ఇమ్మానుయేలురాజు ప్రత్యేకంగా అభినందించారు. విచారణ కోసం వచ్చిన మహిళకు పోలీసుల ద్వారా సహాయం లభించడం హర్షణీయమని తెలిపారు.