హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుత్తి రూరల్ : మండలంలోని తొండపాడు బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏటా నిర్వహించే రాతిదూలం లాగుడు పోటీలు బుధవారం మూడవ రోజు హోరాహోరీగా సాగాయి. న్యూ క్యాటగిరీ విభాగంలో మొత్తం 19 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అగ్రహారానికి చెందిన మహిధర్‌రెడ్డి వృషభాలు 4841 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం అక్కంపల్లికి చెందిన జీహెచ్.రెడ్డి వృషభాలు 4525 అడుగుల దూరం లాగి రెండవ స్ధానం, కర్నూలు జిల్లా సంజామల మండలం ముక్కమల్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి వృషభాలు 4343 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలిచాయి.
రాతిదూలం లాగుడు పోటీలు మరో రెండు రోజుల పాటు జూనియర్, సీనియర్ విభాగాల్లో జరుగుతున్నట్లు నిర్వాహకులు రంగస్వామిరెడ్డియాదవ్, చిన్నరెడ్డియాదవ్లు తెలిపారు. ఈ పోటీల్లో అనంత, కర్నూ లు, వైఎస్సార్, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వృషభాలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో గుత్తి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, నిర్వాహకులు రామచంద్ర, అనిల్, నాగార్జున పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన రైతులు, పోటీదారులకు గొందిపల్లి గ్రామస్తులు అన్నదానం చేశారు.