‘సిట్’ అదుపులో బుల్లయ్య
* స్వర్ణ బార్లో మద్యం వ్యాపార పర్యవేక్షకుడు అతడే..
* కల్తీకి వాడే కెమికల్స్ ఏమిటనేది వెల్లడించని వైనం
* ఇతర బార్ అండ్ రెస్టారెంట్లపైనా దృష్టిసారించిన సీపీ గౌతమ్ సవాంగ్
విజయవాడ సిటీ : కల్తీ మద్యం కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మల్లాది శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుంది. కృష్ణలంక స్వర్ణ బార్లో పనిచేసే వ్యక్తుల సమాచారం మేరకు మద్యం వ్యాపార పర్యవేక్షణ మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్య నిర్వహిస్తున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. మద్యంలో కల్తీ చేసి విక్రయాలు జరుపుతున్నట్లు సిట్ విచారణలో బుల్లయ్య అంగీకరించినట్లు సమాచారం. కల్తీ కోసం వాడే కెమికల్స్ ఎక్కడి నుంచి తెస్తారనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. నగరంలోని అన్ని బార్లలోను కల్తీ జరుగుతున్నట్టు బుల్లయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా కల్తీ మద్యం కేసుతో పాటు ఇతర బార్ అండ్ రెస్టారెంట్ల కార్యకలాపాలపై కూడా దర్యాప్తు చేయాలని సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.
ఈ నెల 7న కృష్ణలంక స్వర్ణ బార్లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృత్యువాత పడడంతో పాటు 31 మంది అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురి పరిస్థితి నేటికి విషమంగానే ఉంది. కల్తీ మద్యం కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం అన్ని కోణాల్లో సమాచారం సేకరిస్తోంది. విచారణలో భాగంగా బుల్లయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మేనేజర్ కీలకం
కల్తీ జరిగిన స్వర్ణ బార్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావు ఈ కేసులో కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. పాతికేళ్లుగా మద్యం షాపుల్లో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు కల్తీ కలపడంలో దిట్టగా చెపుతున్నారు. ఇతనిపై ఇప్పటి వరకు 11 కేసులు ఉండగా, మెజారిటీ కేసులు ఎక్సైజు చట్టం కింద నమోదు చేసినవేనని తెలుస్తోంది. తెల్లని సీసాలలో ఉండే కెమికల్ ఒక చుక్కను మాత్రమే కలపాల్సి ఉందని, ఎక్కువ మోతాదులో వెంకటేశ్వరరావు కలిపి ఉండొచ్చని అదుపు ఉన్న బుల్లయ్య సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఆ కెమికల్ మిథనాలా లేక మరొకటా అనేది మాత్రం స్పష్టం చేయలేదని సమాచారం. మరోసారి విచారణలో భాగంగా అరెస్టు చేసిన బార్ ఉద్యోగులను కస్టడీకి తీసుకోవాలనే యోచనలో పోలీసు అధికారులు ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం కోర్టులో ఫిటిషన్ దాఖలుచేశారు.
అందని నివేదిక
కల్తీ మద్యం కేసుపై నివేదిక పోలీసులకు చేరలేదు. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ పరీక్షల కోసం రక్తం, యూరిన్, విశ్రాతో పాటు శరీరంలోని కొన్ని నమూనాలు పంపారు. ఆయా రిపోర్టులు వచ్చేందుకు మరికొంత వ్యవధి పడుతుందని పోలీసు అధికారులు చెపుతున్నారు. ఈలోగా బార్ ఉద్యోగుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని యోచిస్తున్నారు.