‘బుల్లెట్’ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో తొలిసారి బుల్లెట్ రైలు ప్రతిపాదన వచ్చింది. అప్పటినుంచీ మన బుల్లెట్ ట్రైన్ ఎలా ఉంటుంది? అన్న సందేహాలు అందరిలో రేకెత్తాయి. తాజాగా అహ్మదాబాద్‌లో తొలిబుల్లెట్ ట్రైన్‌కు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి గురువారం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తరువాత బుల్లెట్ రైలు ఎలా ఉండబోతోంది? అందులో ఎటువంటి సదుపాయాలు ఉంటాయి? ఎటువంటి కోచ్‌లో ఉంటాయి? ఎగ్జిక్యూటివ్? నాన్ ఎగ్జిక్యూటివ్? ఎకానమీ క్లాస్ తరగతులు విమానంలో మాదిరిగా ఉంటాయా? వంటి సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. ఆ సందేహాలను తొలగిస్తూ.. బుల్లెట్ రైలు గురించిన ఫీచర్స్ సాక్షి మీకందిస్తోంది.
ఇదీ మన బుల్లెట్
ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే బుల్లెట్ ట్రైన్ జపాన్‌కు చెందిన షిన్కాన్సెన్ ఈ5 సిరీస్‌కు చెందినది. జపాన్‌లో ప్రస్తుతం షిన్కాన్సెన్ ఈ5 సిరీస్ హై స్పీడ్ ట్రయిన్స్ నడుస్తున్నాయి. వీటిలో సాధారణంగా ఎకానమీ (మధ్యతరగతి), గ్రీన్ కార్ (ఎగ్జిక్యూటివ్ క్లాస్), గ్రాన్ కార్ (ఫస్ట్‌క్లాస్) తరగతులు ఉన్నాయి. వీటిలో ఇండియన్ రైల్వేస్ ఎకానమీ, ఎగ్జిక్యూటివ్ కార్ కోచ్‌లను ఎంపిక చేసుకుంది.
సీటింగ్
సాధారణంగా షిన్కాన్సెన్ ఈ5 హై స్పీడ్ ట్రైన్లో 3+2 సీటింగ్ ఉంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 2+2 సీటింగ్ ఉంటుంది. టిఫిన్, భోజనం చేయడానికి ఎగ్జిక్యూటివ్ క్లాస్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. విమానంలో ఇంటీరియర్ ఎలా ఉంటుందో.. ఇందులోనూ అలాగే ఉంటుంది. బేబీ టాయిలెట్స్, బాలింతలు చిన్నారులకు పాలు పట్టేందుకు ప్రత్యేక గది ఉంటుంది.