Bullettu Bandi Song: బుల్లెట్ బండి సాంగ్.. వెయ్యి మందితో రికార్డు
Bullettu Bandi Song New Record: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’ పాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన భోగరాజు పాడిన ఈ సాంగ్.. బారాత్‌లో ఓ పెళ్లికూతురి డ్యాన్స్‌తో సోషల్ మీడియా దృష్టిని ఆకట్టుకుంది. ఆపై రకరకాల వెర్షన్లతో క్రేజీ సాంగ్‌గా మారిపోయింది. తాజాగా ఈ సాంగ్ మరో ఫీట్ అందుకుంది.
ఈ పాటకు జగిత్యాల పట్టణంలో 1000 మందితో నృత్యం చేయించి మరో మెట్టు ఎక్కించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో భాగంగా రవి మచ్చ యూట్యూబ్ ఛానెల్ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలో మహిళలు, యువతులు, చిన్నారులు మొత్తం వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు.
జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, సుంకే రవిశంకర్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతా సురేష్, జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుల్లెట్ బండి సాంగ్‌ను రచయిత లక్ష్మణ్ రాయగా.. ఎస్కే బాజి సంగీతం అందించారు.