బంగారం, వెండి ధరల యూటర్న్
న్యూయార్క్/ ముంబై: సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తుండటంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ఓవైపు డాలరు ఇండెక్సుతోపాటు, 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ బలపడినప్పటికీ పసిడికి డిమాండ్ కనిపించింది. దీంతో గత నాలుగు రోజులుగా క్షీణ పథంలో పయనిస్తున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం యూ టర్న్ తీసుకున్నాయి. స్వల్ప ఆటుపోట్లను చవిచూసినప్పటికీ దేశ, విదేశీ మార్కెట్లో చివరికి లాభాలతో ముగిశాయి. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటాయని, దీంతో ట్రేడర్లు తిరిగి బంగారం, వెండి ఫ్యూచర్స్ లో కొనుగోళ్లకు దిగారని విశ్లేషకులు పేర్కొన్నారు.
నష్టాలకు చెక్..
దేశీయంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ శుక్రవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 268 లాభపడి రూ. 50,260 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,435 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,857 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 750 ఎగసి రూ. 62,260 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 62,750 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ వెనకడుగు వేసింది.
లాభాలతో
న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు సానుకూలంగా ముగిశాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.6 శాతం బలపడి 1,872 డాలర్ల ఎగునవ నిలిచింది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 1,871 డాలర్లకు చేరింది. వెండి 1.4 శాతం జంప్ చేసి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద స్థిరపడింది.