
మళ్లీ పసిడి పరుగులు!
- ముంబై బులియన్ మార్కెట్లో రూ. 29,720
ముంబై: అంతర్జాతీయంగా సానుకూల సెంటిమెంటు నేపథ్యంలో ఇటు దేశీయంగా కూడా పసిడి పరుగులు తీస్తోంది. ఆభరణాల స్టాకిస్టులు, ట్రేడర్ల కొనుగోళ్ల మద్దతుతో పసిడి పరుగులు తీస్తోంది మళ్లీ రూ. 30,000కు చేరువయ్యింది. ముంబై బులియన్ మార్కెట్లో మంగళవారం మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ. 270 పెరిగి రూ. 29,720 వద్ద, ఆభరణాల బంగారం రేటు కూడా అంతే పెరుగుదలతో రూ. 29,580 వద్ద ముగిసింది. 2014 మే 12 తర్వాత పసిడి ధరలు ఈ స్థాయికి ఎగియడం దాదాపు 22 నెలల తర్వాత ఇదే ప్రథమం.
మరోవైపు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో (ఎంసీఎక్స్) ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో పసిడి రేటు ఒక దశలో రూ. 30,161 స్థాయిని తాకింది. కానీ కడపటి వార్తలందే సరికి మళ్లీ తగ్గి.. రూ. 29,846 వద్ద ట్రేడవుతోంది. ఇక, స్పెక్యులేషన్ ఊతంతో ముంబై బులియన్ మార్కెట్లో వెండి రేటు సైతం కేజీకి రూ. 700 పెరిగి రూ. 38,350 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా చూస్తే చైనా వాణిజ్య గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడంతో పసిడిపై సెంటిమెంటు మరింతగా మెరుగుపడింది. దీంతో 13 నెలల గరిష్టానికి ధర ఎగిసింది. న్యూయార్క్ ట్రేడింగ్‌లో ఔన్సు (31.1 గ్రాములు) పసిడి రేటు 1,279 డాలర్ల పైకి ఎగిసింది. కానీ తర్వాత 1,262 డాలర్ల స్థాయికి క్షీణించి.. కడపటి వార్తలందే సరికి 1,265.70 వద్ద ట్రేడవుతోంది.