పూర్వ కలెక్టర్ తీరుతో పార్టీ పతనం
►శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ తీరు దుర్మార్గం
►మంత్రి అఖిలప్రియకు టీడీపీ నేతల ఫిర్యాదు
తిరుపతి తుడా : జిల్లా పూర్వ కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తీరుతో పార్టీ పతనమైందని పలువురు టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్చార్జి, టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని పార్టీనేతలతో సమావేశమయ్యారు. పార్టీ జిల్లాలో క్షీణదశకు చేరిందని, అందుకు పూర్వ కలెక్టర్ కారణమని, ఒక్క పనికూడా చేయలేక ప్రజల్లోకి వెళ్లలేకపోయామని మంత్రికి టీడీపీ నేతలు మొరపెట్టుకున్నారు. ఇళ్లు, పింఛన్లు, రేషన్కార్డుల్లాంటి చిన్న పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదని చెప్పారు.
శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డిపై అవినీతికి పాల్పడుతూ లక్షల రూపాయల అభివృద్ధి పనులన్నీ ఆయన చేసుకుంటున్నారని అక్కడి నేతలు ఫిర్యాదు చేశారు. శ్రీసిటీని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చడం, హెచ్సీఎల్ కంపెనీని అమరావతికి తరలించడం తదితర నిర్ణయాలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని ఓ నేత వెల్లడించారు. నీరు–చెట్టు బిల్లులు మంజూరు కాలేదని శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు చెందిన నేతలు ఫిర్యాదు చేశారు.
నిర్మాణం పూర్తయినా ఇళ్లు కేటాయించలేదని, ఇప్పటివరకు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని తిరుపతి నేతలు విన్నవించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఈ సమస్యలన్నీ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు సుగుణమ్మ, తలారి ఆదిత్య, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు సమీక్షకు హాజరయ్యారు.