వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి !
పాలకొల్లు ప్రభుత్వాస్పత్రి వద్ద బాలుడి మృతదేహంతో ఆందోళనకు దిగిన బంధువులు
పాలకొల్లు టౌన్, న్యూస్‌లైన్ : పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బంధువులు వివరాలిలా ఉన్నాయి. పెనుగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బుంగ సామ్యూల్ (12) తనతల్లిదండ్రులు గణేశ్వరరావు, తులసీరత్నంలతో కలిసి మూడు రోజుల క్రితం యలమంచిలి మండలం దొడ్డిపట్లలో జరిగిన సువార్త మహాసభల్లో పాల్గొనడానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఆరాధనోత్సవాలు ముగియడంతో తిరిగి వెంకటాపురం వెళ్లడానికి దొడ్డిపట్లలో ఆటోలో బయలుదేరారు. దొడ్డిపట్ల శివారుకి వచ్చేసరికి అదేమార్గంలో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సామ్యూల్ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు. అయితే ఆసుపత్రి వైద్యులు సరైన చికిత్స అందించకపోవడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని గణేశ్వరరావు, తులసిరత్నం ఆరోపిస్తూ బాలుడి మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉంచి బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పాలకొల్లు రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్, యలమంచిలి ఎస్సై బి.శ్రీనివాసు, ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ వి.సూర్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింపచేయడంతో ఆందోళన విరమించారు.