దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తం
11 ఏళ్ల చిన్నారి మృతి.. నలుగురి పరిస్థితి విషమం
దేవరగట్టు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టులో మాళమల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన బన్ని ఉత్సవం రక్తసిక్తమైంది. జైత్రయాత్ర పేరిట కొనసాగిన కర్రల సమరంలో ఇరువర్గాల భక్తులు రాళ్లు రువ్వుకోగా 65 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. హొళగుంద మండలం దేవరగట్టుపై కొలువైన మాళమ్మ మాత, మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉత్సవంలో కీలకమైన జైత్రయాత్రకు ఎస్పీ ఆకె రవికృష్ణ నేతృత్వంలో 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు మెగలాయి( కర్రలు, దివిటీలతో కొట్టుకునే ఆట)కు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారింది.