టాలీవుడ్లో మరో 'బ్రూస్ లీ'
తెలుగు ఇండస్ట్రీకి టైటిల్ వివాదాలు కొత్తేం కాదు. అయితే ఈసారి మాత్రం ఈ టైటిల్ వివాదం మరింత రసవత్తరంగా కనిపిస్తోంది. ఒకే టైటిల్‌తో ఇద్దరు హీరోలు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో పోటీపడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'బ్రూస్ లీ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకున్నా, కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. తెలుగులో 'బ్రూస్ లీ ద ఫైటర్' పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను కోలీవుడ్‌లో మాత్రం 'బ్రూస్ లీ 2' పేరుతో రిలీజ్ చేశారు. అప్పటికే కోలీవుడ్ యంగ్ హీరో జివి ప్రకాష్ 'బ్రూస్ లీ' టైటిల్ రిజిస్టర్ చేసుకోవటంతో చెర్రీ తన సినిమాను 'బ్రూస్ లీ 2' పేరుతో రిలీజ్ చేశాడు.
టైటిల్ విషయంలో రామ్ చరణ్ ఫాలో అయిన అదే ఫార్ములాను జివి ప్రకాష్ కూడా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడట. తమిళ్లో 'బ్రూస్ లీ' పేరుతో రిలీజ్ అవుతున్న తన సినిమాను తెలుగులో 'బ్రూస్ లీ 2' పేరుతో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు జివి ప్రకాష్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినా ఫిలిం ఛాంబర్ లో 'బ్రూస్ లీ 2' టైటిల్ రిజిస్టర్ కావటంతో ఇదే వార్త నిజమే అని భావిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
రామ్ చరణ్, జివి ప్రకాష్‌లు ఒకే టైటిల్ కోసం కొట్టుకుంటుంటే, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ లిస్ట్ జాయిన్ అయ్యాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్లో లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కించిన 'బ్రూస్ లీ' సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన వర్మ, ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఇంతమంది బ్రూస్ లీలు ఒకేసారి వెండితెర మీద దాడిచేస్తే అభిమానులు ఎవరిని ఆదరిస్తారో మరి.