బడ్జెట్ లేదు.. జీతాలూ లేవు!
నక్కపల్లి : పనిభారం ఎక్కువగా ఉన్నా జీతాలు చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని తలయారీలు ఆవేదన చెందుతున్నారు. జీతాలు పెంచినా రెండు నెలలకోసారి ఇవ్వడం వల్ల ఇబ్బం దులు పడుతున్నామని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏ (తలయారీలకు) జూన్ నెల జీ తాలు చెల్లించలేదు. ఫిబ్రవరి వరకు వీరికి రూ.3200 లు జీతం చెల్లించేవారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వీరి జీతాలు రూ.ఆరు వేలకు పెంచారు. జిల్లాలో సుమారు 500 మందికి పైగా తలయారీలు పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి వరకు వీరికి సబ్ ట్రజరీ ద్వారా 010 పద్దు(హెడ్)కింద జీతాలు ఐదో తేదీలోగా చెల్లించేవారు.
కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 280, 286 పద్దు(హెడ్)ల ద్వారా చెల్లించాలని ఆదేశాలివ్వడంతో ఫిబ్రవరి నుంచి పెంచిన జీతాలను ఈ పద్దు కింద చెల్లిస్తున్నారు. ఈ విధానంలో రెండు నెలలకొకసారి జీతాలు ఇస్తున్నారు. ఈ పద్దులో మతలబు ఉంది. ఈ హెడ్‌కు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తేనే డ్రా చేసి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వోద్యోగులందరికి 010 హెడ్ ద్వారా జీతాలిస్తారు. వీరికి బడ్జెట్ కొరత ఉండదు.
280, 286 పద్దులకైతే రెండు మూడు నెలలకోసారి బడ్డెట్ కేటాయిస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బందికి ఈ పద్దుల ద్వారానే జీతాలిస్తున్నారు. తలయారీలదీ అదే పరిస్దితి. దీంతో గతంలో మాదిరిగా తమకు 010 పద్దు కింద జీతాలివ్వాలని తలయారీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తలయారీలు నక్కపల్లి తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. జూన్ నెల జీతాలు చెల్లించకపోవడంతో పిల్లల ఫీజులు, పుస్తకాల కొనుగోళ్లకు చేతిలో డబ్బులేని పరిస్దితి నెలకొందని వాపోతున్నారు.
010 కింద జీతాలివ్వాలి
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మాకు జీతాలు పెంచి ప్రతినెలా అందకుండా చేసింది. గతంలో మాదిరిగా 010 పద్దు కింద మాకు జీతాలు చె ల్లించాలి. వచ్చే నెల కూడా జీతాలు అందుతాయో లేదోనన్న ఆందోళన నెలకొంది.
- అబ్బులు, తలయారీ సంఘ అధ్యక్షుడు
ఆలస్యం తగదు
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే మాకు కూడా నెల నెలా జీతాలివ్వాలి. ఏ ఇతర రాబడి లేక ఇదే వృత్తిపై నిరంతరం గ్రామా న్ని అంటిపెట్టుకుని పనిచేసే మాకు ప్రభుత్వం జీతాలు ఆలస్యం చేయడం తగదు. - బాలు, తలయారీ, నెల్లిపూడి