ఇద్దరు భారతీయులకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ : ఇద్దరు భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. ఫిలిప్పైన్స్ అత్యున్నత పురస్కారం రామన్ మెగాసెసే అవార్డు- 2015 కు ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. ఎయిమ్స్ మాజీ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షుగుప్తాలను ఈ అవార్డు వరించింది.
ఇదిలా ఉండగా కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదవిని కోల్పోయి చతుర్వేది గతంలో వార్తల్లోకెక్కారు. ఎయిమ్స్ కుంభకోణాల నేపథ్యంలో ఆయన తన పదవి కోల్పోయారు. ప్రస్తుతం ఇలా అవార్డు దక్కించుకుని మరోమారు వార్తల్లో నిలవడం గమనార్హం. చతుర్వేది దైర్యాన్ని మెచ్చి, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి నిర్మూలనకు చేసిన కృషికిగానూ ఈ అవార్డు అందజేయనున్నట్లు అవార్డు యాజమాన్యం ప్రకటించింది. సృజనాత్మక, నాయకత్వ లక్షణాలను చూసి అన్షు గుప్తాకు ఈ గౌరవాన్ని అందించామని తెలిపింది.