కుటుంబం సజీవ దహనం
= మారుతి వ్యాన్‌లో మంటలు... నలుగురి మృతి
= మృతులు బెంగళూరువాసులు
= తిరుమలేశుని దర్శనానంతరం తిరుగు ప్రయూణంలో దుర్ఘటన
పలమనేరు (చిత్తూరు), న్యూస్‌లైన్ : బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం తిరుమలేశుని దర్శనానంతరం తిరుగుప్రయూణంలో కారు ప్రమాదానికి బలరుంది. నలుగురి ప్రాణాలు మంటలకు ఆహుతయ్యూయి. ఈ ఘోర సంఘటన పలమనేరుకు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్లో భూతలబండ మృత్యు మలుపు వద్ద బుధవారం వేకువజామున చోటుచేసుకుంది.
బెంగుళూరులోని సంపంగిరామ్ నగర్‌కు చెందిన సత్యనారాయణ కుటుంబం సోమవారం ఉదయం తిరుమలేశుని దర్శనార్థం కేఏ01 1531 అనే నంబర్ మారుతీ ఓమిని వ్యాన్‌లో వెళ్లింది. దేవున్ని దర్శించుకుని మంగళవారం అర్ధరాత్రి తిరుమల నుంచి బెంగుళూరుకు బయలుదేరింది. మొగిలి ఘాట్‌లోని భూతలబండ మలుపు వద్దకొచ్చేసరికి కారులోంచి మంటలు చెలరేగాయి. కారు నడుపుతున్న సత్యనారాయణ (51) ఆందోళనకు గురై రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్నాడు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్న అతని భార్య మహాలక్ష్మి (45), కుమార్తె దీపమాల (22) , కుమారుడు ప్రశాంత్ కుమార్ (26)లు మంటల్లో చిక్కుకున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లాక్ కావడంతో డోర్లు, అద్దాలు తెరుచుకోలేదు. తండ్రి పక్కన కూర్చున్న ప్రశాంత్ కుమార్ అద్దాలను పగులగొట్టి కాలుతున్న శరీరంతోనే బయటకు దూకేశాడు. కారులోనే అతని తండ్రి, తల్లి, చెల్లెలు గుర్తుపట్టనంత విధంగా మంటల్లో కాలి బూడిదయ్యారు. ఆ మార్గంలో వెళ్లే డ్రైవర్లు గమనించి పలమనేరులోని స్థానికులకు తెలిపారు.
దీంతో 108, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌కుమార్ ఒంటిపై మంటలను 108 సిబ్బంది ఆర్పి స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్సలు చేశారు. అనంతరం వేలూరు సీఎంసీ ఆస్పత్రి తరలించారు. అతడు కూడా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు.
సీఐ సమయస్ఫూర్తి
ప్రమాదస్థలానికి చేరుకున్న పలమనేరు సీఐ బాలయ్య మృతుల వివరాల సేకరణలో సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. కారు లోపల కాలిపోయి ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని అందులోని సిమ్‌కార్డు ఆధారంగా కొన్ని నంబర్లకు ఫోన్ చేశారు. దీంతో సత్యనారాయణ సోదరుడు శంకరనారాయణ లైన్లోకి రావడంతో మృతుల వివరాలు, వారి సంబంధీకుల గురించి తెలుసుకున్నారు. మృతదేహాలకు త్వరితగతిన శవపరీక్ష చేయించి బంధువులకు అప్పగించారు.