‘విమానం’ మోత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ నెల 11వ తేదీ ఇండిగో విమానం చార్జీ రూ.2,600. అదే రోజు కోసం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు చార్జీ సుమారు రూ.2,000. సాధారణ రోజుల్లో ఈ బస్సు చార్జీ రూ.650 మాత్రమే. కానీ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు రెట్లు పెంచేశారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉండే హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–విశాఖ వంటి రూట్లు మాత్రమే కాదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు అన్ని రూట్లలోనూ ప్రైవేట్ బస్సులు చుక్కలు చూపిస్తున్నాయి.
వీటికి తోడు వైట్ నంబర్ ప్లేట్లపైన క్యాబ్ సర్వీసులను అందజేసే ట్రావెల్స్ కార్లు సైతంచార్జీలలో ‘విమానం’మోత మోగిస్తున్నాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన 4,850కి పైగా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను విధించి ప్రయాణికుల జేబు గుల్ల చేస్తున్నారు. దీంతో నగరవాసులకు సంక్రాంతి ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారింది. ట్రావెల్స్ సంస్థలు లాక్డౌన్ కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని ఇప్పుడు భర్తీ చేసుకొనేందుకు దోపిడీకి దిగుతున్నారు.
ఓ కుటుంబానికి రూ.10,000..
సాధారణంగా హైదరాబాద్–విశాఖ ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులో రూ.980 నుంచి 1,200 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని బస్సుల్లోనూ సీట్లు బుక్ అయ్యాయని, అదనంగా చెల్లిస్తే తప్ప తాము ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేమని ఆపరేటర్లు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారు 10 నెలలుగా సొంత ఊళ్లకు వెళ్లలేకపోయిన నగరవాసులు సంక్రాంతికి వెళ్లి సంతోషంగా గడపాలని భావిస్తున్నారు. కానీ, ప్రయాణ చార్జీలు మోయలేని భారంగా మారాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో ప్రయాణ చార్జీలు ఏకంగా రూ.10,000 దాటుతోంది.
అరకొర రైళ్లే...
సాధారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 150 రైళ్లను నడుపుతారు. ఈ సారి కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం 70 ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా, సంక్రాంతి దృష్ట్యా మరో 45 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని రైళ్లు లేకపోవడంతో వెయిటింగ్ లిస్టు భారీగా పెరిగింది. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తదితర ప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రధాన రైళ్లలో 250 నుంచి 350 వరకు నిరీక్షణ జాబితా ఉంది. కొన్ని రైళ్లలో ‘నోరూమ్’దర్శనమిస్తోంది.