bus - lorry accident
-
15 మంది అమర్నాథ్ యాత్రికులు మృతి!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని బద్రాగుండ్ క్రాసింగ్ వద్ద టిప్పర్ డంపర్ ఢీకోట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ఆ వరదల్లో సుమారు 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. అమరనాథ్ యాత్రకు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి గురువారం 5వేల మంది యాత్రికులు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ‘నున్వాన్-పహల్గామ్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి 201 వాహనాల్లో మొత్తం 5,449 మంది యాత్రికులు బయలుదేరారు. ’ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. జున్ 29న భగవతి నగర్ బేస్ క్యాంప్‌లో అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు గవర్నర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 88,526 మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో ఆరోగ్య సమస్యలతో 11 మంది మరణించారు. ఆగస్టు 11న రక్షా బంధన్, శ్రావణ పౌర్ణిమ రోజున అమర్నాథ్ యాత్ర ముగియనుంది. ఇదీ చూడండి: ప్రధాని మోదీ హత్యకు కుట్ర?.. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్ -
గాఢనిద్రలోనే... అనంతలోకాలకు
మిర్యాలగూడ అర్బన్: తెల్లవారుజాము.. బస్సు వేగంగా వెళ్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.. బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలిసేలోపు ఇద్దరి ప్రాణాలు పోయా యి. రాఖీ పండుగను జరుపుకోవడానికి సొంత ఊళ్లకు వచ్చిన వారు పండుగను ముగించుకుని తిరిగి వెళ్తూ ప్రమాదం బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కామేపల్లి నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 40 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ బయలు దేరింది. తెల్లవారుజామున 3 గంటలకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకోగానే అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి బైపాస్‌పై చింతపల్లి క్రాసింగ్ సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆస్పత్రి బయట తన ఇద్దరు పిల్లలతో దీనంగా కూర్చున్న క్షతగాత్రురాలు ముందుభాగంలో కూర్చున్న ప్రకాశం జిల్లా పెద్దకాల్వకుంటకు చెందిన మేడుగ మల్లికార్జున్ (40), ముక్కెనవారిపాలెంకు చెందిన కొత్త నాగేశ్వర్రావు (44) ఇద్దరూ లారీ, బస్సుకు మధ్యలో ఇరు క్కుని అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్ లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ వీరు జీవ నం సాగిస్తు న్నారు. రోడ్డు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుంటూరు జిల్లా నాగులవరం గ్రామానికి చెందిన సురభి జయరావు (42) మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 15 మంది, బస్సు డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సదానాగరాజు తెలిపారు. -
తమిళనాట నెత్తురోడిన రోడ్లు
సాక్షి, చెన్నై: తమిళనాడులో గురువారం వేకువజామున రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు ఘటనల్లో కలిపి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుప్పూర్ జిల్లా అవినాశి వద్ద బస్సును లారీ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. సేలం– బెంగళూరు జాతీయ రహదారిలో సేలం జిల్లా ఓమలూరు వద్ద నేపాల్ నుంచి వచ్చిన పర్యాటకుల బృందం ప్రయాణిస్తున్న మినీ బస్సును మరో ప్రైవేటు బస్సు ఢీ కొన్న మరో ఘటనలో ఏడుగురు నేపాల్ వాసులు మరణించారు. బెంగళూరు నుంచి వస్తుండగా.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు బుధవారం రాత్రి బయలు దేరింది. ఇందులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. గురువారం వేకువజామున 3 గంటల సమయంలో కేరళ నుంచి సేలంకు వెళ్తున్న లారీ అవినాశి రాకియా పాళయం కూడలి వద్ద డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డుకు మరో వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న కేరళ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు డ్రైవర్లు సహా మొత్తం 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ 23 మందిని తిరుప్పూర్, కోయంబత్తూరు ఆసుపత్రులకు తరలించారు. ఆధ్యాత్మిక పర్యటనలో.. మరో ఘటనలో.. భారత్‌లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న నేపాల్‌లోని కఠ్మాండూకు చెందిన 32 మంది బృందం రోడ్డు ప్రమాదం బారిన పడింది. కన్యాకుమారి నుంచి రాజస్తాన్‌కు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును సేలం– బెంగళూరు జాతీయ రహదారిలోని ఓమలూరు నరిపల్లం వద్ద ఎదురుగా వచ్చిన ఒక ప్రైవేటు బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు నేపాల్ వాసులు మరణించారు. గాయపడ్డ 25 మందిని చికిత్స నిమిత్తం సేలం ఆస్పత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు - లారీ ఢీ: 30 మందికి గాయాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాగమంగళం వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను పలమనేరు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.