బస్సులో బట్టలు చించి.. లైంగిక వేధింపులు
లండన్: చట్టాలు కఠినంగా ఉండే ఇస్లాం దేశాల్లోనూ మహిళలపైనా లైంగిక వేధింపుల పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మొరాకోలోని కాసాబ్లాంకా పట్టణంలో ఓ బస్సులో యువతిని దారుణంగా వేధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో నలుగురు కుర్రాళ్లు నవ్వుతూ, ఆమె టాప్, జీన్స్ బట్టలు చించుతూ, అరబిక్ భాషలో బండ బూతులు తిట్టడం, ఆమె నోటికి టేప్ వేసి హింసించటం.. యువతి కన్నీళ్ల పర్యంతం కావటం ఉంది. అయితే అంత జరుగుతున్నా ఆమెకు సాయం చేసేందుకు తోటి ప్రయాణికులెవరూ ముందుకు రాకపోవటం గమనార్హం. ఆదివారం నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే యువతిపై అత్యాచారం జరిగిందంటూ విమర్శలు వినిపించటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 నుంచి 17 ఏళ్ల వయసున్న ఆరుగురు బాలురు ఈ వెకిలి చేష్టకు పాల్పడ్డారని రుజువు కావటంతో వారిని అరెస్ట్ చేశారు.
ఇక ఘటనపై పలువురు భిన్నంగా స్పందించారు. మరికొందరు యువతి డ్రెస్సింగ్ సరిగ్గా లేదని, ఆమె రెచ్చగొట్టడం మూలంగానే వాళ్లు అలా చేసి ఉంటారని కామెంట్లు చేశారు. మరికొందరు మహిళల శరీరాన్ని గౌరవించండి అంటూ చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం జీన్స్ వేసుకుందన్న కారణంతో మొరాకో వీధుల్లోనే ఓ యువతిని కొందరు ఫాలో అయి వేధించిన వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.