మత్తయ్య కోసమేనా బాబు బస్సు నిద్ర?
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు గురువారం రాత్రి విజయవాడలో బస్సులోనే బస చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయం కారిడార్లో బస్సును నిలిపి అందులో నిద్రించడంలోని ఆంతర్యమేంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. కేసీఆర్పై ఫిర్యాదు చేసిన మత్తయ్య ఆరోజు రాత్రి చంద్రబాబును కలిశారన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడలో బస చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన స్థానికంగా ఉన్న ఒక స్టార్ హోటల్లోనే ఉంటున్నారు. ఆరోజు కూడా ఆ హోటల్లోనే సీఎం బస చేస్తారని అధికారులకు సమాచారం ఇచ్చారు.
అయితే చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుని ఆయన క్యాంపు కార్యాలయం బయట కారిడార్లో బస్సును నిలిపి అందులోనే బస చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం స్టార్ హోటల్లో బస చేసి ఉంటే అక్కడ ఎవరెవరు సంచరిస్తున్నారు? ఎవరెవరు వచ్చిపోతున్నారన్న విషయం ఆ హోటల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డవుతుంది. అయితే క్యాంపు కార్యాలయం ఆవరణలోని బస్సులో బస ఏర్పాటు చేయడం వల్ల, అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో వచ్చిపోయే వారెవరన్న విషయం గమనించడానికి, అవసరమైన పక్షంలో సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించడానికి వీల్లేకుండా పోయింది.
అయితే కేసీఆర్పై ఫిర్యాదు చేసిన మత్తయ్య ఆ కేసు వ్యవహారంలో గురువారం విజయవాడలో సిట్ అధికారుల ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. స్టీఫెన్సన్తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడినట్టు ఆడియో రికార్డులు బయటకొచ్చిన రోజు నుంచి మత్తయ్య విజయవాడలో ఉంటున్నారని చెబుతున్నారు. బాబు ఉదంతం తర్వాతే ఆయన విజయవాడ సత్యనారాయణపురంలో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకరు ఆయనకు ఆశ్రయం కల్పించినట్టు టీడీపీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అదే తరహాలో గురువారం చంద్రబాబును మత్తయ్య బస్సులో కలిశారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.