business review
-
టాటా ఉప్పు’... కంపెనీ మారింది!
న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వ్యాపార పునర్వ్యవస్థీకరణ దిశగా ఓ కీలక నిర్ణయం జరిగింది. టాటా కెమికల్స్‌కు చెందిన ఆహారోత్పత్తుల వ్యాపారం టాటా గ్లోబల్ బేవరేజెస్లో విలీనం కానుంది. ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఈ వ్యాపార విలీనం ఉంటుందని టాటా కెమికల్స్ లిమిటెడ్ (టీసీఎల్) తెలిపింది. ప్రతీ టాటా కెమికల్ షేరుకు 1.14 టాటా గ్లోబల్ బేవరేజెస్ షేర్లు కేటాయిస్తారు. టాటా కెమికల్స్‌కు చెందిన ఉప్పు, మసాలాలు, పప్పులు తదితర ఆహారోత్పత్తులను టాటా గ్లోబల్ బేవరేజెస్ (టీజీబీఎల్) పరం అవుతాయి. ఆ తర్వాత టీజీబీఎల్ పేరును టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌గా మారుస్తారు. దీంతో రూ.9,099 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అవతరిస్తుంది. ఈ మేరకు టాటా కెమికల్స్, టీజీబీఎల్ కంపెనీల బోర్డులు బుధవారం సమావేశమై నిర్ణయాలు తీసుకున్నాయి. టాటా కెమికల్స్ నుంచి కన్జ్యూమర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని వేరు చేసి, టీజీబీఎల్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపాయి. వాటాదారులు, స్టాక్ ఎక్సేంజ్‌లు, నియంత్రణ సంస్థల ఆమోదం అనంతరం ఈ వ్యాపార విలీనం జరుగుతుంది. నవ్యత కావాలి... తన ప్రధాన ఉత్పత్తుల విషయంలో టీజీబీఎల్‌కు నవ్యత అవసరమని ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. మరింత వృద్ధి అవకాశాల కోసం ఎంచుకున్న ప్రాంతాల్లో వ్యాపారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరపు టీజీబీఎల్ కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అవకాశాలను సొంతం చేసుకునే విధంగా భవిష్యత్తు విధానాలు ఉండాలని, అందుకు తగిన విధంగా సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ఆకాంక్షలను చేరుకునేందుకు శక్తిమంతమైన టాటా బ్రాండ్ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. వృద్ధికి మరింత అవకాశం ఇరు కంపెనీల వినియోగదారుల ఆధారిత వ్యాపారాన్ని ఏకం చేయడం వల్ల ఆహారం, పానీయాల మార్కెట్లో వాటా పెంచుకోవచ్చని, దీనివల్ల రెండు కంపెనీల వాటాదారులు ప్రయోజనం పొందుతారని కంపెనీ నుంచి విడుదలైన ప్రకటన పేర్కొంది. టీజీబీఎల్ టాటా టీ, టెట్లే పేరుతో టీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఎయిట్ ఓ క్లాక్ బ్రాండ్ కింద కాఫీని, ఇంకా బాటిల్డ్ వాటర్, గ్లూకోవిటా తదితర ఉత్పత్తులను సైతం మార్కెట్ చేస్తోంది. టాటా కాఫీ కూడా టీజీబీఎల్ అనుబంధ సంస్థే. ఇక టాటా కెమికల్స్ ప్రపంచంలో మూడో అతిపెద్ద సోడా యాష్ తయారీదారు. కన్జ్యూమర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని డీమెర్జ్ చేసిన తర్వాత టాటా కెమికల్స్ పూర్తిగా బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీగా కొనసాగుతుంది. ‘‘ఎఫ్ఎంసీజీ విభాగంలో ఫుడ్, బేవరేజెస్ పరంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ స్థానం బలపడుతుంది. దేశీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలను చేరుకునేందుకు ఈ విలీనం ద్వారా బలమైన ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశాం’’ అని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
ప్చ్.. ఎదురీతే!
రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక రంగాల పరిస్థితి ఈ ఏడాది పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. సర్కారు అలసత్వం... విద్యుత్ కోతలు.. ఇతరత్రా సమస్యలతో ఈసురోమంటూ నెట్టుకొస్తున్న పారిశ్రామిక వర్గాలపై మరో పిడుగు పడింది. రాష్ట్ర విభజన అంశం... వ్యాపార, వాణిజ్య రంగాలను కుదిపేసింది. షాపింగ్ మాల్స్ మొదలు బ్యాంకింగ్ దాకా అన్నింటికీ ఈ సెగ తగిలింది. ఇక రాష్ట్రానికే తలమానికంగా నిలిచి.. కుంభకోణంతో మసకబారిన ఒకప్పటి ఐటీ దిగ్గజం ‘సత్యం’ పేరు పూర్తిగా కనుమరుగైంది కూడా ఈ ఏడాదే. రాష్ట్రానికి చెందిన అనేక కంపెనీలు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితిలోకి దిగజారాయి కూడా. అయితే, కంపెనీల కొనుగోళ్ల విషయంలో మన కార్పొరేట్లు కాస్త దూకుడును ప్రదర్శించారు. ఇక తొలి విమానయాన సంస్థ రాష్ట్రం నుంచి ఆవిర్భవించడం కాస్త చెప్పుకోదగ్గ విషయం. మొత్తంమీద చూస్తే.. ఒకడుగు ముందుకు... ఆరడుగులు వెనక్కి అన్న చందంగా గడిచిన ఈ ఏడాది మరో రెండు రోజుల్లో తెరమరుగవుతోంది. కొత్త ఏడాదివైపే గంపెడాశలతో ఎదురుచూడాల్సిన రాష్ట్ర వ్యాపార రంగంలో గతేడాది కీలక ఘట్టాల పునరావలోకనమే ఈ ‘ఏపీ బిజినెస్ రౌండప్’.... ఇద్దరు దిగ్గజాల అస్తమయం రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఫార్మా దిగ్గజాలు ఈ ఏడాది అస్తమించారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి మరణం.. ఇటు రాష్ట్రంతో పాటు దేశీయ ఫార్మాకు తీరని లోటును మిగిల్చింది. జనరిక్స్ ఔషధాలతో ధరలను సామాన్యుడికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత అంజిరెడ్డిది. మరోవైపు, వ్యాక్సిన్ తయారీలో రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బయోలాజికల్ ఇ’ చైర్మన్, ఎండీ విజయ్ కుమార్ దాట్ల ఈ ఏడాది మార్చిలో మరణించారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన విజయ్ కుమార్ 43ఏళ్లపాటు కంపెనీకి సేవలందించారు. డీపీటీ సహా పలు వ్యాక్సిన్ల తయారీకి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కష్టాల్లో ఇన్ఫ్రా... రాష్ట్ర ఇన్ఫ్రా కంపెనీలకు ఈ ఏడాది కష్టకాలంగానే గడిచింది. ప్రాజెక్టులు ముందుకు సాగక కంపెనీలకు రుణాల భారం పెరిగిపోయింది. సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు అప్పుల్లో కూరుకున్న జీఎంఆర్ పలు ప్రాజెక్టుల్లో వాటాలను విక్రయించుకొని నిధుల సమీకరణలో పడింది. ప్రస్తుతం ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు జాయింట్ వెంచర్ నుంచి వైదొలగనుంది. ఈ జేవీలో జీఎంఆర్‌కి ఉన్న 40 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బర్హాద్ రేసులో నిలిచింది. డీల్ విలువ సుమారు రూ. 1,900 కోట్లుగా అంచనా. ఇక ల్యాంకో ఇన్ఫ్రా సైతం రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు సుమారు రూ. 7,600 కోట్ల విలువైన అసెట్స్‌ను విక్రయించే ప్రయత్నాల్లో పడింది. రాష్ట్రంలో తొలి ఎయిర్‌లైన్స్ టేకాఫ్... రాష్ట్రానికి చెందిన తొలి విమానయాన సంస్థ ‘ఎయిర్ కోస్టా’ ఈ ఏడాది అక్టోబర్‌లో టేకాఫ్ తీసుకుంది. విజయవాడ కేంద్రంగా ప్రారంభంలో రెండు విమానాలతో ఆరు నగరాలకు సర్వీసులను ప్రారంభించింది. రూ. 150 కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలను మొదలుపెట్టిన ఈ సంస్థ.. వచ్చే రెండేళ్లలో విస్తరణ కోసం 10 కోట్ల డాలర్లను(దాదాపు రూ.600 కోట్లు) వెచ్చించాలనే ప్రణాళికల్లో ఉంది. విమానాల సంఖ్యను 2018 నాటికి 25కి పెంచాలనేది కంపెనీ లక్ష్యమని ఎయిర్ కోస్టా ఎండీ రమేష్ లింగమనేని ప్రకటించారు. 2015 నాటికి చార్టర్డ్, కార్గో సేవల్లోకి ప్రవేశించాలని కూడా ఈ కంపెనీ ఉవ్విళ్లూరుతోంది. ఫార్మా... షాపింగ్ వివిధ డీల్స్‌కి రాష్ట్ర ఫార్మా వేదికగా నిల్చింది. ఆక్టస్ ఫార్మా సంస్థను గ్రాన్యూల్స్ ఇండియా రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్.. రాష్ట్ర సంస్థ గ్లాండ్ ఫార్మాలో మైనారిటీ వాటాను 200 మిలియన్ డాలర్లకు కొనుక్కొంది. క్యాన్సర్ ఔషధం నెక్సావర్ తయారీ కోసం కంపల్సరీ లెసైన్సు ఇవ్వడం సబబేనంటూ మేధోహక్కుల అప్పిలేట్ బోర్డు కూడా నాట్కో ఫార్మాకి అనుకూలంగా తీర్పునిచ్చింది. హయసింథ్స్ ఫార్మాను అరబిందో ఫార్మా సుమారు రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. కార్పొరేట్ డీల్స్ సందడి... విజయ్ ఎలక్ట్రికల్స్‌కి చెందిన విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం తోషిబా దాదాపు 200 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. హైడ్రాలిక్స్ సిలిండర్స్ తయారీ సంస్థ వేన్ బర్ట్ పెట్రోకెమికల్స్‌ను పెన్నార్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. మైహోమ్ ఇండస్ట్రీస్.. తమిళనాడుకు చెందిన జయజ్యోతి సిమెంట్స్‌ను సుమారు రూ. 1,400 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కోరమాండల్ చేతికి లిబర్టీ ఫాస్ఫేట్ గ్రూప్. డీల్ విలువ దాదాపు రూ.375 కోట్లు. ‘సత్యం’ కనుమరుగు.. ఒకప్పుడు రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన ఐటీ సంస్థ ‘’ పేరు పూర్తిగా కనుమరుగైంది. మహీంద్రా సత్యం(గతంలో సత్యం కంప్యూటర్స్) టెక్ మహీంద్రాలో విలీన ప్రక్రియ ఈ ఏడాదిలో పూర్తయ్యింది. తద్వారా దేశీయంగా అయిదో అతి పెద్ద ఐటీ కంపెనీగా ఆవిర్భవించింది. రూ. 7,000 కోట్ల పైచిలుకు అకౌంటింగ్ కుంభకోణంతో సత్యం సంక్షోభంలో చిక్కుకోవడం, 2009లో మహీంద్రా గ్రూప్ దాన్ని కొనుగోలు చేయడం తెలిసిందే. మరోవైపు, ఇన్ఫోటెక్.. తైవాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో శాఖలు ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ ఐటీ ఉత్పత్తులందించే విరించి టెక్నాలజీస్.. బెంగళూరుకి చెందిన ఎస్లేపియస్ కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీస్‌ని కొనుగోలు చేసింది.