business tax
-
దోపిడీకి ‘ఎర్ర’ తివాచీ !
ఎర్రమట్టిని కొల్లగొడుతున్న అక్రమార్కులు ప్రభుత్వ,అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే గ్రావెల్ తరలింపు సర్కారీ ఖజానాకు రూ.కోట్లలో గండి కొండలు, చారిత్రక ప్రదేశాలు, గుట్టలు, అసైన్డ్భూములు, చెరువులు, అటవీభూములు ఖాళీగా కనిపిస్తే చాలు. రాత్రికి రాత్రే భారీ యంత్రాల సాయంతో తవ్వి జేబులు నింపుకోవటం అక్రమార్కులకు పరిపాటిగా మారింది. రాష్ట్ర మంత్రి ఇలాకాలో కొనసాగుతున్న అక్రమ దందా ఇది. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో అత్యంత విలువైన ఎర్రమట్టి నిల్వలు ఉన్నాయి. వంకాయలపాడు, బోయపాలెం, మైదవోలు, సంగం గోపాలపురం, చెంఘీజ్ ఖాన్పేట, యడ్లపాడు, పుట్టకోట ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి (రెడ్‌గ్రావెల్)పై అధికారపార్టీకి చెందిన కొంతమంది కన్ను పడింది. రాజధాని శంకుస్థాపనతో భూములకు రేట్లు పెరగటంతో రెడ్‌గ్రావెల్ కు డిమాండ్ ఏర్పడింది. రియల్ఎస్టేట్ వెంచర్లలో రోడ్ల నిర్మాణానికి, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎర్రమట్టి రవాణా చేస్తుంటారు. ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 300 వరకు ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మాఫీయాను తలపిస్తున్న వ్యవహారం ... గతం నుంచి ఈ మట్టిని తవ్వటానికి అనుమతి పొందిన వ్యక్తులు మైనింగ్ అధికారులు సూచించన ప్రాంతంలోనే తవ్వకాలు జరపాలి. కేటాయించిన ప్రాంతంలో నిబంధనల మేరకు 18 అడుగుల లోతు వరకే తవ్వకాలు నిర్వహించాలి. ప్రాంత సరిహద్దుల్లో సుమారు మూడు అడుగుల భూమిని వదిలివేయాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. అనుమతి పొందిన ప్రాంతంతో సంబంధం లేకుండా చుట్టుపక్కల ఎకరాల మేర మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. మట్టిని తవ్విన ప్రాంతం అటవీభూమి, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రదేశమా, ప్రభుత్వ భూమి అన్న నిబంధనలతో వీరికి పనిలేదు. యడ్లపాడు ప్రాంతంలో ఉన్న 17 వందల ఎకరాల ప్రభుత్వ భూమి, వేల ఎకరాల అటవీ భూమి, టెక్స్టైల్ పార్కుకు కేటాయించిన 130 ఎకరాల భూముల సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి... ఎర్రమట్టి అక్రమ తరలింపు వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రభు త్వానికి వాణిజ్యపన్నుల ద్వారా, మైనింగ్ సెస్సుల ద్వారా రావాల్సిన ఆదాయం అవినీతి అధికారులు, అధికారి పార్టీ నేతల చేతుల్లోకి చేరుతుంది. ఒక్కొక్క యూనిట్‌కు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రూ.100 లు చెల్లించాలి. రెండు నెలల కాలంలో ఈ ప్రాంతం నుంచి 6 లక్షల యూనిట్ల తరలించారు. ఒక్కో యూనిట్ రెడ్ గ్రావెల్ ధర రూ. 2 వేలు ఉంది. మొత్తం 6 లక్షల యూనిట్లకు 12 కోట్ల రూపాయలను అక్రమ తవ్వకం దారులు తమ జేబుల్లో వేసుకున్నారు. దీంతో పాటు వాణిజ్యపన్నుల శాఖకు కూడా భారీ స్థాయిలో ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. మేడమ్ కల్పించుకోవడంతో... అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి విచారణ చేపట్టేలోగా అక్రమార్కులకు వత్తాసుగా, ఇక్కడవ పవర్ పాయింట్‌గా వ్యవహరిస్తున్న ‘మేడమ్’ కల్పించుకోవడంతో వెనక్కు తిరిగి వెళుతున్నారు. గతంలో జిల్లా అటవీశాఖ అధికారి రెండు పొక్లయినర్లను సీజ్ చేసి అక్కడ ముగ్గురు బీటు అధికారులను కాపలా ఉంచారు. ఇది జరిగిన రెండో రోజు రాత్రి ఒంటిగంట సమయంలో 10 మంది యువకులు బీట్ అధికారులను బెదిరించి ఒక పొక్లయినర్‌ను తీసుకువెళ్లారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. -
అక్రమార్కులకు వరంగా ఇ-రిజిస్ట్రేషన్
సులువుగా రిజిస్ట్రేషన్, సీ-ఫామ్, వేబిల్లు పొందే వీలు = వాణిజ్యపన్నుల శాఖకు రూ. కోట్లలో గండి సాక్షి, హైదరాబాద్: వ్యాపారులకు సరళీకృత విధానం ద్వారా సేవలందించే ఉద్దేశంతో వాణిజ్యపన్నుల శాఖ అమలు చేస్తున్న ఇ- రిజిస్ట్రేషన్ విధానం అక్రమార్కులకు వరంగా మారింది. వాణిజ్యపన్నుల శాఖలోని సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్(సీఆర్‌యు) ద్వారా ఆన్లైన్లోనే వ్యాట్ డీలర్‌గా, సీఎస్టీ డీలర్‌గా నమోదైన వ్యక్తులు అక్రమ పద్ధతుల్లో వ్యాపారాలు సాగిస్తూ పన్ను ఎగ్గొడుతున్నారు. ముఖ్యంగా 14.5 శాతం వ్యాట్ ఉన్న సరుకుల వ్యాపారం చేసే డీలర్లు అంత మొత్తంలో పన్ను చెల్లించకుండా 2 శాతం పన్నుతో బయటపడేందుకు ఇ- రిజిస్ట్రేషన్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. తద్వారా వాణిజ్యపన్నుల శాఖకు వచ్చే పన్నుకు రూ.కోట్లలో గండి పడుతోంది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఆ నంబర్‌తో ఆన్లైన్లోనే సి-ఫారాలు, వేబిల్లులు జనరేట్ చేసుకునే అవకాశం ఉండటంతో అక్రమార్కులకు పన్ను ఎగవేసేందుకు అవకాశం లభిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని కంపెనీలు ఇక్కడి రిజిస్టర్డ్ డీలర్‌తో వ్యాపారం సాగిస్తే 2 శాతం పన్ను చెల్లించే వెసులుబాటు ఉండటంతో బోగస్ పేర్లతో డీలర్లను సృష్టించి దొంగ సీ- ఫారాలు, వేబిల్లులతో రూ. కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్లైవుడ్ అక్రమ రవాణాకు ఇదే విధానాన్ని అవలంబించినట్లు తేలడంతో.. అధికార యంత్రాంగం 14.5 శాతం పన్ను చెల్లించే ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టింది. మార్బుల్, ఐరన్, స్టీల్, మసాలా దినుసులు, బాస్మతి బియ్యం, సెల్ఫోన్లు, ఎల క్ట్రానిక్ వస్తువులు వంటి వ్యాపారాలు సాగిస్తున్న వారి రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇ- రిజిస్ట్రేషన్ల ద్వారా వ్యాట్, సీఎస్టీ డీలర్లుగా నమోదైన వారి వివరాలు సేకరిస్తోంది. గుర్తింపు కార్డు, చిరునామా ఉంటే చాలు ఇ-రిజిస్ట్రేషన్ విధానం లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలున్నాయి. ఈ మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఉన్నవారెవరైనా వ్యాపారిగా, వ్యాట్, సీఎస్టీ డీలర్‌గా నమోదుృచేసుకోవచ్చు. మూడు నెలల లోపు సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారంపై అనుమానం వస్తే వాణిజ్య శాఖ అధికారులు తనిఖీ చేస్తారు. అయితే సిబ్బంది కొరత కారణంగా ఇదీ నామమాత్రంగానే జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. దాంతో నకిలీ అడ్రస్, ధ్రువపత్రాలతో పలువురు డీలర్‌గా రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై, కేరళ, గుజరాత్ నుంచి భారీగా దిగుమతి హైదరాబాద్‌కు దిగుమతి అవుతున్న సున్నితమైన వినిమయ వస్తువులు (సెన్సిటివ్ కమోడిటీస్) ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఇ- రిజిస్ట్రేషన్ ద్వారా డీలర్లుగా నమోదై ఆయా రాష్ట్రాల నుంచి సరుకును దిగుమతి చేసుకున్న ఏజెన్సీలు, డీలర్లపై వాణిజ్యపన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి పెట్టింది.