అక్రమార్కులకు వరంగా ఇ-రిజిస్ట్రేషన్
సులువుగా రిజిస్ట్రేషన్, సీ-ఫామ్, వేబిల్లు పొందే వీలు
= వాణిజ్యపన్నుల శాఖకు రూ. కోట్లలో గండి
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులకు సరళీకృత విధానం ద్వారా సేవలందించే ఉద్దేశంతో వాణిజ్యపన్నుల శాఖ అమలు చేస్తున్న ఇ- రిజిస్ట్రేషన్ విధానం అక్రమార్కులకు వరంగా మారింది. వాణిజ్యపన్నుల శాఖలోని సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్(సీఆర్‌యు) ద్వారా ఆన్‌లైన్‌లోనే వ్యాట్ డీలర్‌గా, సీఎస్‌టీ డీలర్‌గా నమోదైన వ్యక్తులు అక్రమ పద్ధతుల్లో వ్యాపారాలు సాగిస్తూ పన్ను ఎగ్గొడుతున్నారు. ముఖ్యంగా 14.5 శాతం వ్యాట్ ఉన్న సరుకుల వ్యాపారం చేసే డీలర్లు అంత మొత్తంలో పన్ను చెల్లించకుండా 2 శాతం పన్నుతో బయటపడేందుకు ఇ- రిజిస్ట్రేషన్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. తద్వారా వాణిజ్యపన్నుల శాఖకు వచ్చే పన్నుకు రూ.కోట్లలో గండి పడుతోంది.
ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఆ నంబర్‌తో ఆన్‌లైన్‌లోనే సి-ఫారాలు, వేబిల్లులు జనరేట్ చేసుకునే అవకాశం ఉండటంతో అక్రమార్కులకు పన్ను ఎగవేసేందుకు అవకాశం లభిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని కంపెనీలు ఇక్కడి రిజిస్టర్డ్ డీలర్‌తో వ్యాపారం సాగిస్తే 2 శాతం పన్ను చెల్లించే వెసులుబాటు ఉండటంతో బోగస్ పేర్లతో డీలర్లను సృష్టించి దొంగ సీ- ఫారాలు, వేబిల్లులతో రూ. కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్లైవుడ్ అక్రమ రవాణాకు ఇదే విధానాన్ని అవలంబించినట్లు తేలడంతో.. అధికార యంత్రాంగం 14.5 శాతం పన్ను చెల్లించే ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టింది. మార్బుల్, ఐరన్, స్టీల్, మసాలా దినుసులు, బాస్మతి బియ్యం, సెల్‌ఫోన్‌లు, ఎల క్ట్రానిక్ వస్తువులు వంటి వ్యాపారాలు సాగిస్తున్న వారి రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇ- రిజిస్ట్రేషన్ల ద్వారా వ్యాట్, సీఎస్‌టీ డీలర్లుగా నమోదైన వారి వివరాలు సేకరిస్తోంది.
గుర్తింపు కార్డు, చిరునామా ఉంటే చాలు
ఇ-రిజిస్ట్రేషన్ విధానం లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలున్నాయి. ఈ మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఉన్నవారెవరైనా వ్యాపారిగా, వ్యాట్, సీఎస్‌టీ డీలర్‌గా నమోదుృచేసుకోవచ్చు. మూడు నెలల లోపు సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారంపై అనుమానం వస్తే వాణిజ్య శాఖ అధికారులు తనిఖీ చేస్తారు. అయితే సిబ్బంది కొరత కారణంగా ఇదీ నామమాత్రంగానే జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. దాంతో నకిలీ అడ్రస్, ధ్రువపత్రాలతో పలువురు డీలర్‌గా రిజిస్టర్ చేసుకుంటున్నారు.
ఢిల్లీ, ముంబై, కేరళ, గుజరాత్ నుంచి భారీగా దిగుమతి
హైదరాబాద్‌కు దిగుమతి అవుతున్న సున్నితమైన వినిమయ వస్తువులు (సెన్సిటివ్ కమోడిటీస్) ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఇ- రిజిస్ట్రేషన్ ద్వారా డీలర్లుగా నమోదై ఆయా రాష్ట్రాల నుంచి సరుకును దిగుమతి చేసుకున్న ఏజెన్సీలు, డీలర్లపై వాణిజ్యపన్నుల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దృష్టి పెట్టింది.