ఔను! ఆ అవార్డు కొనుక్కున్నదే: నటుడు
మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కొందరికే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో బాలీవుడ్ అలనాటి కథానాయకుడు, సీనియర్ నటుడు రిషీ కపూర్ ఒకరు. ఆయన తాజాగా రాసిన ఆత్మకథ ’ఖుల్లాంఖుల్లా’.. తన మనస్సులోని విషయాలు, తన అభిప్రాయాలు చాలా సూటిగా స్పష్టంగా ఈ పుస్తకంలో వ్యక్తీకరించారు ఆయన. ఎన్నో వివాదాలను కూడా స్పృశించారు. కొన్ని నిజాలను అంగీకరించారు.
అంతేకాదు రిషీ కపూర్ మొట్టమొదటి సినిమా ’బాబీ’. ఈ సినిమాకు 1973లో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. బ్లాక్ బ్లస్టర్ సినిమా ’జంజీర్’ లో అమితాబ్ బచ్చన్‌తో పోటీపడి మరీ.. రిషీ కపూర్ ఈ అవార్డు గెలుపొందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే, ఈ అవార్డు గురించి ఓ షాకింగ్ నిజాన్ని రిషీ కపూర్ వెల్లడించారు. అప్పట్లో ఈ అవార్డును కొనుగోలు చేయడం వల్లే తనకు వచ్చిందని తెలిపారు. ఇందుకు తాను ఇప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు చెప్పారు. అప్పట్లో తనకు పెద్దగా లోకజ్ఞానం లేదని, కేవలం 20 ఏళ్ల పిల్లాడిని మాత్రమేనని తెలిపారు. ఆ అవార్డు కొనుగోలుచేసినంత మాత్రాన మిగతా అవార్డులన్నీ అలా కొనుక్కుంటే వచ్చినవేనని అనడం సరికాదని పేర్కొన్నారు.