Buying grain centers
-
సెలవుల్లోనూ సేకరణ
సాక్షి, అమరావతి: పంటల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. అనేక కొత్త యాప్‌లను ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ రైతులకు మేలు కలిగేలా సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. పంటలు అమ్ముకునే సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తోంది. పక్కా వ్యూహంతో కందులు, శనగలు, జొన్న, మొక్కజొన్న, రాగులు, పసుపు, ఉల్లి పంటలను రైతుల నుంచి సేకరిస్తోంది. మండలానికి ఒకటో, రెండో ఉండే కొనుగోలు కేంద్రాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లింది. రోజువారీ లక్ష్యాలను విధించడంతో పండుగలు, ఆదివారాల్లోనూ సిబ్బంది పంటను కొనుగోలు చేస్తూ రైతుకు ఆసరాగా నిలుస్తున్నారు. తద్వారా ధరల స్థిరీకరణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొనుగోలు చేసిన పంటలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం గిడ్డంగులకు చేరుస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అధిక సంఖ్యలో గుమికూడకుండా ముందుగానే వారికి కూపన్లు జారీ చేస్తోంది. రైతులకు నిర్ణయించిన తేదీలోనే పంటను కేంద్రానికి తీసుకువెళ్లే ఏర్పాటు చేసింది. లాక్డౌన్ కారణంగా హమాలీలు, రవాణా సమస్యలున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. 838 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 838 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం నాటికి రూ.1,076 కోట్ల విలువైన 2,80,679 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను సేకరించింది. రైతులు తొందరపడి వ్యాపారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా ఫిబ్రవరిలోనే పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. ఈ–క్రాప్ నమోదుపై రైతులకు అవగాహన కల్పించింది. ఉల్లి కొనుగోలుకు 6 కేంద్రాలు, రాగులు కొనుగోలుకు 10 కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని సేకరిస్తోంది. మారుమూల గ్రామాల్లోని ఉల్లిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపకపోతే.. ఆ గ్రామాలకు సిబ్బందిని పంపి పంటను కొనుగోలు చేసింది. పంట పండిస్తే చాలు.. అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవనే ధీమాను రైతుకు కలిగించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నగదును కూడా చెల్లించేస్తోంది. నూతన విధానాలతో అన్నీ సాధ్యమే మార్కెటింగ్ శాఖలో అనేక నూతన విధానాలను అమల్లోకి తెచ్చాం. కొన్ని యాప్‌ల ద్వారా గ్రామ స్థాయి సమాచారాన్ని, సమస్య లను క్షణాల్లో సిబ్బంది నుంచి తెలుసుకుంటున్నాం. వాటి పరి ష్కారానికి వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నాం. మార్కెట్ యార్డులకు ఏ రోజు ఎంత పంట వస్తుంది.. ఎంత పంట కొనుగోలు చేస్తుందనే వివరాలు ప్రధాన కార్యాలయానికి వచ్చేస్తున్నాయి. యాప్‌లపై సిబ్బందికి అవగాహన కలిగించాం. – ప్రద్యుమ్న,మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ -
మిల్లర్ల దోపిడీ.. నిర్వాహకుల మద్దతు!
కరీంనగర్‌రూరల్: ధాన్యం కొనుగోలు సీజన్ వచ్చిదంటే రైస్ మిల్లర్లకు పండుగ. కష్టపడి పంట పండించిన రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మిల్లర్లు మాత్రం తాలుపేరిట దోచుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు అదనంగా 2 కిలోలు తూకం వేస్తూ దండుకుంటున్నారు. అధికారుల మౌఖిక ఆదేశాలతోనే అదనంగా 2 కిలోలు తూకం వేస్తున్నామంటూ నిర్వాహకులు రైస్ మిల్లర్లకు పరోక్షంగా సహకరిస్తున్నారు. కరీంనగర్ మండలం రబీ సీజన్లో 6,396 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా 2 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అధికారులు అంచనా వేశారు. 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయి తే పలు గ్రామాల్లో పంట చివరిదశలో అగ్గితెగులు, మెడవిరుపు ఆశించడంతో గింజలు వట్టిపోయాయి. తాలుపేరిట జూబ్లీనగర్, నగునూర్ గ్రామాల్లో ధాన్యం తూకం వేయడం లేదంటూ ఇటీవల రైతులు ఆందోళన చేపట్టారు. ఈనెల 24న దుర్శేడు కొనుగోలు కేంద్రంలో 42 కిలోలు తూకం వేయడంపై రైతులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సాధారణంగా 40 కిలోల చొప్పున వడ్ల బస్తాను తూకం వేస్తారు. సంచి బరువు 600 గ్రాముల నుంచి 800 గ్రాముల వరకు ఉండటంతో కిలో అదనంగా ధాన్యం కాంటా వేస్తారు. అయితే దుర్శేడు సహకార సంఘం పరిధిలోని ఇరుకుల్ల, మొగ్దుంపూర్, గోపాల్పూర్, నల్లగుంటపల్లి, చేగుర్తి కొనుగోలు కేంద్రాల్లో తాలుపేరిట మొత్తం 42 కిలోల ధాన్యం కాంటా పెడుతున్నారు. మేలు రకం ధాన్యం తెచ్చినా అదనంగా 2 కిలోలు తూకం వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాలుపేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల మౌఖిక ఆదేశాలతో తాలుంటే అదనంగా 2 కిలోలు తూకం వేస్తున్నట్లు సంఘం ఉద్యోగి తెలిపాడు. -
‘రైతులను వాడుకొని మొండిచేయి చూపాడు’
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరు మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ఆళ్లనాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా.. గత టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసిందని ఆరోపించారు. రైతలను ఎన్నికలకు వాడుకుని వారికి మొండిచేయి చూపిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందుతుందన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాలను మహిళల ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. రైతు భరోసా అమలు చేసి లక్షలాది మంది రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. కొమడవోలు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు ఇస్తామని ప్రకటించారు. -
దళారులదే హవా!
రైతులకు తగిన మద్దతు ధర కల్పించి, వారి నుంచి సేకరించేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు దళారులకు అడ్డాలుగా మారాయి. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తూ వారు సొమ్ము చేసుకుంటున్నారు. కళ్లాలవద్దకు వచ్చి సొమ్ము చెల్లిస్తుండడంతో రైతులు, తమకు శ్రమ లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువస్తున్నందుకు అధికారులు.. దళారులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాలు జోరుగా సాగడానికి ఇదే అసలు కారణం. విజయనగరం కంటోన్మెంట్: అధికారుల పర్యవేక్షణ లోపం, తగిన సౌకర్యాలు కల్పించకపోవడం, నిబంధనల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులు ప్రయోజనం పొందలేకపోతున్నారు. ధాన్యం సరఫరా చేసిన వెంటనే డబ్బులు చెల్లించకపోవడం, శాంపిళ్ల అవస్థలు, రవాణా ఖర్చుల భారంతో పాటు పెట్టుబడుల కోసం దళారులు ముందుగా అడ్వాన్సులివ్వడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా కళ్లాల వద్దకు వస్తున్న దళారులకే దాన్యం విక్రయిస్తున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా నోరు మెదపడంలేదు. ఎందుకంటే ప్రభుత్వం విధించిన సవాల క్ష నిబంధనల కారణంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం ఇవ్వడం లేదు. ఇలా అయితే లక్ష్యాలు చేరుకోవడం కష్టం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎటూ దళారులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయిస్తున్నారు కాబట్టి లక్ష్యం నెరవేరుతోందని అధికారులు మిన్నుకుంటున్నారు. రైతులకు అందని మద్దతు ధర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.1360 కంటే రూ. 200 నుంచి రూ.300 తక్కువకు దళారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం నెరవేరుతున్నా... రైతులకు మద్దతు ధర అందకుండా పోతోంది. అయినా అధికారులు గమ్మునుంటున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నది దళారులే....కానీ ఆ ధాన్యాన్ని ఎవరి వద్ద కొనుగోలు చేస్తున్నారో వారి పట్టా పాసు పుస్తకాలు, వారి వివరాలను అధికారులకు వ్యాపారులు అప్పగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కొత్తలో ధాన్యాన్ని సివిల్సప్లై అధికారులే కొనుగోలు చేశారు. అయితే ధాన్యం అమ్మకాలు జోరందుకోవడంతో ఇప్పుడు ప్రైవేటు వ్యాపారులు రంగప్రవేశం చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేందుకు అధికారులు గోనె సంచులు ఇస్తారు. వాటి ద్వారానే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు దీనికి భిన్నంగా జరుగుతోంది. పౌరసరఫరాల శాఖ ఇస్తున్న పురి గోనెలు కాకుండా తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. తూర్పారబట్టిన చోటే వీటిని ఆ గోనె సంచుల్లో ఎక్కిస్తున్నారు. వాటి ద్వారానే మిల్లులకు నేరుగా ధాన్యం వెళుతోంది. అయినా అధికారులు స్పందించడం లేదు. దీంతో ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తున్నట్టు ? అధికారులా? దళారులా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 81 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్న అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారా ? లేదా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యం వెళ్తున్నాయా అంటే స్పష్టమయిన సమాచారం లేదు. జిల్లాలో ఉన్న కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నామని చెబుతున్న అధికారులు, కొనుగోలు చేస్తున్న తీరును మాత్రం గమనించడం లేదు. కొంత మంది దళారులు వరిపంట వేసే ముందే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు. అలా అడ్వాన్సు వ్యాపారం చేస్తున్న దళారులు ఇప్పుడు తమకు ధాన్యం ఇవ్వాలని కోరడంతో రైతులు కూడా వారికే తూకం వేసి ఇస్తున్నారు. ఇలా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని వారు నేరుగా మిల్లులకు పట్టుకెళుతున్నారు. దీంతో అధికారులు ఇంత ప్రచారం చేసినా ధాన్యం మాత్రం ప్రైవేటు వ్యాపారుల పరమవుతోంది. జిల్లాలో ఇంత వరకూ స్తబ్దుగా ఉన్న ధాన్యం వ్యాపారం ఇప్పుడు జోరందుకుంది. జిల్లాలో ఇప్పటివరకూ దాదాపు రూ. 32 కోట్ల విలువైన 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా రైతులకు రూ.14 కోట్ల పై చిలుకు బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారమంతా నేరుగా రైతులు చేయకుండా దళారుల ద్వారా జరుగుతోంది. దీంతో ఇటు రైతులు నష్టపోవడమే కాకుండా, అటు రైతులకు మద్దతు ధర చెల్లించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.