సాక్షి, అమరావతి: పంటల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. అనేక కొత్త యాప్‌లను ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ రైతులకు మేలు కలిగేలా సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. పంటలు అమ్ముకునే సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తోంది. పక్కా వ్యూహంతో కందులు, శనగలు, జొన్న, మొక్కజొన్న, రాగులు, పసుపు, ఉల్లి పంటలను రైతుల నుంచి సేకరిస్తోంది. మండలానికి ఒకటో, రెండో ఉండే కొనుగోలు కేంద్రాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లింది.
రోజువారీ లక్ష్యాలను విధించడంతో పండుగలు, ఆదివారాల్లోనూ సిబ్బంది పంటను కొనుగోలు చేస్తూ రైతుకు ఆసరాగా నిలుస్తున్నారు. తద్వారా ధరల స్థిరీకరణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొనుగోలు చేసిన పంటలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం గిడ్డంగులకు చేరుస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అధిక సంఖ్యలో గుమికూడకుండా ముందుగానే వారికి కూపన్లు జారీ చేస్తోంది. రైతులకు నిర్ణయించిన తేదీలోనే పంటను కేంద్రానికి తీసుకువెళ్లే ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్ కారణంగా హమాలీలు, రవాణా సమస్యలున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
838 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 838 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం నాటికి రూ.1,076 కోట్ల విలువైన 2,80,679 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను సేకరించింది. రైతులు తొందరపడి వ్యాపారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా ఫిబ్రవరిలోనే పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. ఈ–క్రాప్ నమోదుపై రైతులకు అవగాహన కల్పించింది. ఉల్లి కొనుగోలుకు 6 కేంద్రాలు, రాగులు కొనుగోలుకు 10 కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని సేకరిస్తోంది. మారుమూల గ్రామాల్లోని ఉల్లిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపకపోతే.. ఆ గ్రామాలకు సిబ్బందిని పంపి పంటను కొనుగోలు చేసింది. పంట పండిస్తే చాలు.. అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవనే ధీమాను రైతుకు కలిగించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నగదును కూడా చెల్లించేస్తోంది.
నూతన విధానాలతో అన్నీ సాధ్యమే
మార్కెటింగ్ శాఖలో అనేక నూతన విధానాలను అమల్లోకి తెచ్చాం. కొన్ని యాప్‌ల ద్వారా గ్రామ స్థాయి సమాచారాన్ని, సమస్య లను క్షణాల్లో సిబ్బంది నుంచి తెలుసుకుంటున్నాం. వాటి పరి ష్కారానికి వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నాం. మార్కెట్ యార్డులకు ఏ రోజు ఎంత పంట వస్తుంది.. ఎంత పంట కొనుగోలు చేస్తుందనే వివరాలు ప్రధాన కార్యాలయానికి వచ్చేస్తున్నాయి. యాప్‌లపై సిబ్బందికి అవగాహన కలిగించాం.
– ప్రద్యుమ్న,మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment