దళారులదే హవా!
రైతులకు తగిన మద్దతు ధర కల్పించి, వారి నుంచి సేకరించేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు దళారులకు అడ్డాలుగా మారాయి. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తూ వారు సొమ్ము చేసుకుంటున్నారు. కళ్లాలవద్దకు వచ్చి సొమ్ము చెల్లిస్తుండడంతో రైతులు, తమకు శ్రమ లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువస్తున్నందుకు అధికారులు.. దళారులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాలు జోరుగా సాగడానికి ఇదే అసలు కారణం.
విజయనగరం కంటోన్మెంట్: అధికారుల పర్యవేక్షణ లోపం, తగిన సౌకర్యాలు కల్పించకపోవడం, నిబంధనల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులు ప్రయోజనం పొందలేకపోతున్నారు. ధాన్యం సరఫరా చేసిన వెంటనే డబ్బులు చెల్లించకపోవడం, శాంపిళ్ల అవస్థలు, రవాణా ఖర్చుల భారంతో పాటు పెట్టుబడుల కోసం దళారులు ముందుగా అడ్వాన్సులివ్వడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా కళ్లాల వద్దకు వస్తున్న దళారులకే దాన్యం విక్రయిస్తున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా నోరు మెదపడంలేదు. ఎందుకంటే ప్రభుత్వం విధించిన సవాల క్ష నిబంధనల కారణంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం ఇవ్వడం లేదు. ఇలా అయితే లక్ష్యాలు చేరుకోవడం కష్టం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎటూ దళారులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయిస్తున్నారు కాబట్టి లక్ష్యం నెరవేరుతోందని అధికారులు మిన్నుకుంటున్నారు.
రైతులకు అందని మద్దతు ధర
ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.1360 కంటే రూ. 200 నుంచి రూ.300 తక్కువకు దళారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం నెరవేరుతున్నా... రైతులకు మద్దతు ధర అందకుండా పోతోంది. అయినా అధికారులు గమ్మునుంటున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నది దళారులే....కానీ ఆ ధాన్యాన్ని ఎవరి వద్ద కొనుగోలు చేస్తున్నారో వారి పట్టా పాసు పుస్తకాలు, వారి వివరాలను అధికారులకు వ్యాపారులు అప్పగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కొత్తలో ధాన్యాన్ని సివిల్‌సప్లై అధికారులే కొనుగోలు చేశారు. అయితే ధాన్యం అమ్మకాలు జోరందుకోవడంతో ఇప్పుడు ప్రైవేటు వ్యాపారులు రంగప్రవేశం చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేందుకు అధికారులు గోనె సంచులు ఇస్తారు.
వాటి ద్వారానే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు దీనికి భిన్నంగా జరుగుతోంది. పౌరసరఫరాల శాఖ ఇస్తున్న పురి గోనెలు కాకుండా తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. తూర్పారబట్టిన చోటే వీటిని ఆ గోనె సంచుల్లో ఎక్కిస్తున్నారు. వాటి ద్వారానే మిల్లులకు నేరుగా ధాన్యం వెళుతోంది. అయినా అధికారులు స్పందించడం లేదు. దీంతో ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తున్నట్టు ? అధికారులా? దళారులా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 81 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్న అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారా ? లేదా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యం వెళ్తున్నాయా అంటే స్పష్టమయిన సమాచారం లేదు. జిల్లాలో ఉన్న కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నామని చెబుతున్న అధికారులు, కొనుగోలు చేస్తున్న తీరును మాత్రం గమనించడం లేదు. కొంత మంది దళారులు వరిపంట వేసే ముందే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు.
అలా అడ్వాన్సు వ్యాపారం చేస్తున్న దళారులు ఇప్పుడు తమకు ధాన్యం ఇవ్వాలని కోరడంతో రైతులు కూడా వారికే తూకం వేసి ఇస్తున్నారు. ఇలా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని వారు నేరుగా మిల్లులకు పట్టుకెళుతున్నారు. దీంతో అధికారులు ఇంత ప్రచారం చేసినా ధాన్యం మాత్రం ప్రైవేటు వ్యాపారుల పరమవుతోంది. జిల్లాలో ఇంత వరకూ స్తబ్దుగా ఉన్న ధాన్యం వ్యాపారం ఇప్పుడు జోరందుకుంది. జిల్లాలో ఇప్పటివరకూ దాదాపు రూ. 32 కోట్ల విలువైన 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా రైతులకు రూ.14 కోట్ల పై చిలుకు బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారమంతా నేరుగా రైతులు చేయకుండా దళారుల ద్వారా జరుగుతోంది. దీంతో ఇటు రైతులు నష్టపోవడమే కాకుండా, అటు రైతులకు మద్దతు ధర చెల్లించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.