అంగన్వాడీల ప్రదర్శన
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన సాగర్ సెంటర్, అద్దంకి బస్టాండు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, మస్తాన్‌దర్గా సెంటర్,ట్రంకురోడ్డు, మిరియాలపాలెం, చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకొంది. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నగర కార్యదర్శి బీ వెంకట్రావు మాట్లాడుతూ అంగన్వాడీలతో రోజుకు ఎనిమిది గంటలకు పైగా పని చేయించుకుంటూ అరకొర వేతనాలు ఇస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతోపాటు ఎన్నికల విధులు, అక్షర విజయం వంటి అదనపు విధులు చేస్తున్నారని తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం పదివేల రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల తరబడి అంగన్వాడీలుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ అనంతరం ఎలాంటి ప్రోత్సాహకాలు పొందడం లేదన్నారు. శాసనసభ్యులు, మంత్రులకు లక్షలాది రూపాయల వేతనాలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్న అంగన్వాడీలను పాలకులు చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.
అంగన్వాడీలకు పోటీగా బాలబడులు ఏర్పాటు చేయడం, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బాలబడుల నిర్వహణ అంగన్వాడీలకు అప్పగించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 21వ తేదీ జరగనున్న చలో హైదరాబాద్‌కు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొనాలని వెంకట్రావు పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు కేవీ సుబ్బమ్మ, కే శ్రీదేవి, సీఐటీయూ నాయకులు ఎస్ కోటేశ్వరరావు, సీహెచ్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.