16న సీఎం పర్యటన
కలెక్టరేట్ (కాకినాడ), న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 16న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పర్యటించనున్నారని కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. మండల, డివిజనల్ అధికారులతో కలెక్టరేట్ నుంచి ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రచ్చబండ కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రామాణీకరించిన బ్యాక్ డ్రాప్‌లను మాత్రమే ప్రదర్శించాలన్నారు.
పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి దరఖాస్తుకూ తప్పనిసరిగా రశీదు అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవలి భారీ వర్షాల వల్ల ఐదు రోజులకు పైబడి ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 20 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. మూడు రోజులు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 10 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయాలని సూచించారు. బాధితుల వివరాలు, పంట, ఇళ్లకు జరిగిన నష్టాల జాబితాను వారం రోజుల్లో పూర్తి చేయాలని, నమోదు సక్రమంగా చేయాలని చెప్పారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమీక్షిస్తూ జిల్లాలో కొత్తగా అర్హత పొందిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో బి.యాదగిరి, సీపీఓ వి.మహీపాల్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చంద్రశేఖరరాజు, జేడీఏ ఎన్.విజయ్ కుమార్, జేడీ ఏహెచ్ లివింగ్స్టన్, మత్స్యశాఖ జేడీ గోవిందయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.