కెమెరా కంటికి చిక్కిన బైకు దొంగలు!!
జంట నగరాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడో కొత్తరకం దొంగతనాలు మొదలయ్యాయి. పార్కింగులో ఉన్న వాహనాలను చాకచక్యంగా లేపేస్తున్నారు. పొరపాటున ఆదమరచి ఉన్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఏమాత్రం వాహనాలకు గ్యారంటీ ఉండట్లేదు. ముఖ్యంగా సైకిళ్లు, బైకులు ఇలాంటి చోరీలకు గురవుతున్నాయి. బైకులు మెరుపు వేగంతో మాయమైపోతున్నాయి. వేలరూపాయలు పోసి సొంత బైకు కొనుక్కున్న ఆనందం ఇంకా తీరకముందే ఆ బైకు ఏ షాపింగ్ కాంప్లెక్సులోనో పార్కింగ్ చేస్తే.. నిమిషాల్లో మాయం అయిపోతోంది. అలాగని బయటే పెట్టక్కర్లేదు. కాస్త రద్దీ ప్రాంతంలో మీ ఇల్లు ఉన్నా కూడా.. ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను కూడా చకచకా తీసుకెళ్లిపోతున్నారు.
అసలు ఎవరూ గుర్తించని వాహనాన్ని చూస్తే చాలు.. వాళ్ల చేతులకు దురద మొదలైపోతుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చూడటం, తమను ఎవరూ గమనించకపోతే లైన్ క్లియరైపోయిందని వెంటనే రంగంలోకి దూకుతారు. క్షణాల్లో డ్యూటీకెక్కుతారు. కుదిరితే మారుతాళంతో బైకు తాళం తీస్తారు. వీలైతే తోసుకుంటూ వెళ్లిపోతారు. ఇక సైకిళ్లనయితే, చిన్న పిల్లలు కూడా ఎంచక్కా పార్కింగ్ ప్రదేశాలలోకి వెళ్లి, దొరల్లా తొక్కుకుంటూ వెళ్లిపోతున్నారు. సొంత సైకిల్ కూడా అంత దర్జాగా ఎవరూ తీసుకెళ్లలేరన్నంత ధీమాగా వాళ్లు వెళ్తున్నారు. బైకు లేదా సైకిల్ చోరీ అయ్యిందని యజమాని చూసుకునే వరకూ మూడో కంటికి కూడా విషయం తెలియడు. దొంగల పనితనం అంత అద్భుతంగా ఉంటోంది మరి. ఈ కొత్త తరహా దొంగతనాలు చూసి పోలీసులు తల పట్టుకుంటున్నారు.