చంద్రబాబు పర్యటనకు ఎమ్మెల్యే ఉమ దూరం
భువనగిరి, న్యూస్‌లైన్, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం వరంగల్ వెళ్తూ భువనగిరి బైపాస్ టీచర్స్ కాలనీ వద్ద మధ్యాహ్నం 3.45 గంటలకు ఆగారు. అయితే భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి ఇక్కడకు రాలే దు. వలిగొండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె చంద్రబాబు వస్తున్న విషయం తెలిసి కూడా ఆయనకు స్వాగతం చెప్పడానికి రాలేదు.
ఆమెకు తాను వస్తున్న సమాచారం చంద్రబాబు ఇవ్వలేదా లేకుంటే ఉద్దేశపూర్వకంగా రాలేదా అన్నది కార్యకర్తల్లో చర్చ నీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బాబు పర్యటనకు దూ రంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్యకర్తలు కూడా పెద్దగా హాజరుకాలేదు.
కార్యకర్తల్లో నిరాశ
చంద్రబాబు కోసం ఎదురు చూసిన ఆపార్టీ కార్యకర్తలకు భువనగిరిలో నిరాశే మిగిలింది. ఆయన స్వాగతం పలకడానికి నాయకులు కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ కార్యకర్తల వద్దక చేరుకోగానే వారు నినాదాలు చేస్తూ ఆయన కారువద్దకు వెళ్లారు. పూలమాలలు వేసి నినాదాలు చేశారు.
తమను ఉద్దేశించి మాట్లాడుతాడని ఊహించిన కార్యకర్తలు ఆయన మాట్లాడకుండా వెళ్లడంతో నిరాశచెందారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎదురు చూసిన కార్యకర్తలకు చంద్రబాబు రెండు నిముషాలు కూడా నిలబడి మాట్లాడకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
దండలు వేయడానికి పోటీపడిన నాయకులు
చంద్రబాబు నాయుడుకు దండలు వేయడానికి దేశం నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు. నినాదాలు చేస్తు వారు దండలు వేశారు. అందరి వద్ద దండలు తీసుకుని కారుపై చంద్రబాబు వేసుకోగా ఆయన వ్యక్తి గత సిబ్బంది వాటిని రోడ్డు పక్కన పడవేసి వేళ్లారు. కార్యక్రమంలో ఎడ్ల సత్తిరెడ్డి, ఎక్బాల్చౌదరి, కృష్ణాచారి, వీరేశం, నాజర్, చంద్రశేఖర్, బచ్చు శ్రీను, మాటూరి శ్రీను, బాలయ్య, పద్మ, రామలక్ష్మయ్య, రజీయా, దొప్పవెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.