bypoll election schedule
-
పొలిటికల్ కారిడార్ : మూడు పార్టీల నేతల్లో మునుగోడు టెన్షన్
-
Andhra Pradesh: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీ ఏర్పడిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 6. నామినేషన్ల పరిశీలన జూన్7న. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 9. జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 28న ఉప ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుంది. కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉప ఎన్నిక జరిగే స్థానాలు ►ఉత్తర ప్రదేశ్: రెండు ఎంపీ స్థానాలు (రాంపూర్, అజాంఘర్) ►పంజాబ్: ఒక ఎంపీ స్థానం (సంగ్రూర్) ►త్రిపుర: నాలుగు అసెంబ్లీ స్థానాలు (అగర్తల, టౌన్ బోర్డోవళి, సుర్మా, జుబరాజ్‌నగర్) ► ఆంధ్రప్రదేశ్: ఒక అసెంబ్లీ స్థానం (ఆత్మకూరు) ►ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం (రాజిందర్ నగర్) ►జార్ఖండ్: ఒక అసెంబ్లీ స్థానం (మాందార్) -
ఆపరేషన్ హుజూరాబాద్, బీజేపీ యాక్షన్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్కు ధీటుగా తాము కూడా దూసుకుపోవాలనే ఆలోచనతో బీజేపీ నేతలున్నారు. అధికార పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఈనెల 16న హుజురాబాద్‌లో బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కేడర్‌ను సమాయత్తపరుస్తున్నారు. జిల్లా మంత్రులు కూడా అక్కడే మకాం వేశారు. ఇలా గులాబీ దళం ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తుండటం, ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చుననే ఊహాగానాల నేపథ్యంలో.. పకడ్బందీ కార్యాచరణను రూపొందించేందుకు బీజేపీ నేతలు సిద్ధమౌతున్నారు. ఈ నెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీని ఎప్పుడు ప్రకటించినా ఆ వెంటనే పాదయాత్ర ఆ నియోజకవర్గానికి చేరుకునేలా రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. ఈలోపు వివిధ రూపాల్లో కార్యక్రమాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని కూడా భావిస్తున్నారు. ఉప ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే ప్రచార ప్రణాళికను రూపొందించుకుని దానికనుగుణంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ‘స్థానిక’పట్టు సడలకుండా.. టీఆర్ఎస్ టికెట్‌పై హుజురాబాద్ నుంచి వరసగా ఆరు పర్యాయాలు గెలుపొందిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో.. నిన్నమొన్నటి వరకు ఆయనతో కలిసి పనిచేసిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. రాజకీయ అవసరాలు, ఇతర ప్రయోజనాల కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీ వైపే నిలిచే అవకాశా లు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినం ఈటల కూడా తనవైన సొంత వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. మొన్నటివరకు తనతో ఉన్నవారు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ కేడర్‌తో మమేకమై టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే జిల్లాకు చెందినవారు కావడంతో ఆయనకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో స్థానిక పరిస్థితులపై అవగాహనతో రాజకీయ సమీకరణాలకనుగుణంగా ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలతో తలపడాలని భావిస్తున్నారు. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా
సాక్షి, బెంగళూరు: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కన్నడనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. అనర్హుల్లో రోషన్ బేగ్ తప్ప అందరూ అధికార బీజేపీలో చేరారు. వీరు డిసెంబరులో జరిగే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేల్లో 17 మందికి గాను 16 మందికి గురువారం బెంగళూరులో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప కాషాయ కండువా కప్పారు. బెంగళూరు శివాజీనగర కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను బీజేపీలోకి ఆహ్వానించలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు. కాగా, కొత్త నేతల రాకను బీజేపీ స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బుజ్జగించడం యడ్యూరప్ప ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది. -
ఇప్పట్లో వరంగల్ ఉప ఎన్నిక లేనట్లే!
హైదరాబాద్: ఖాళీగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తొలుత భావించినా.. దీనిపై ఎన్నికల ప్రధాన కమిషన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రధాన కమిషర్ నసీం జైదీ బుధవారం విడుదల చేశారు. కాగా, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఎటువంటి షెడ్యూల్ ను విడుదల చేయకపోవడంతో.. ఆ ఎన్నిక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చలు మొదలైనా.. నోటిఫికేషన్ రాకపోవడంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాన్ని రచించుకోవడానికి మరికాస్త సమయం దక్కిందనే చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవిని స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జూలై 21న ఆయన రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలపడంతో వరంగల్ ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల చట్టం ప్రకారం సీటు ఖాళీ అయినప్పటి నుంచీ ఆరు నెలల వ్యవధిలో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.