C - DAC
-
త్వరలోనే భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ త్వరలోనే ప్రారంభం కాగలదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ తెలిపారు. చిప్‌ల తయారీలో టాప్ 6–7 భాగస్వాముల్లో ఒకటిగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. తిరువనంతపురంలోని సీ–డీఏసీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా శర్మ ఈ విషయాలు చెప్పారు. భారతీయ ప్రమాణాలకు, అధునాతన మీటరింగ్ విధానానికి అనుగుణంగా ఉండే స్మార్ట్ ఎనర్జీ మీటర్‌ను సీ–డీఏసీ తయారు చేసింది. వీటితో విద్యుత్ వినియోగం తగ్గుతుందని, బిల్లింగ్ సక్రమంగా ఉండటంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుందని శర్మ వివరించారు. -
అక్టోబర్ 15కల్లా శాశ్వత పీఎఫ్ ఖాతా
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులందరికీ శాశ్వత సంఖ్యను కేటాయించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ముమ్మర చర్యలు చేపట్టింది. అక్టోబర్ 15కల్లా తన ఐదు కోట్ల మంది వినియోగదారులకు ప్రత్యేకంగా వ్యక్తిగత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను అందుబాటులోకి తేచ్చే పనిలో పడింది. బ్యాంకు ఖాతా ఉన్న వారు ఏ బ్రాంచిలోనైనా సేవలు పొందినట్లే.. పీఎఫ్ ఖాతాదారులు యూఏఎన్‌తో అన్ని రకాల పీఎఫ్ సేవలు పొందవచ్చు. ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేసుకోవడం లేదా కొత్త పీఎఫ్ ఖాతాను తెరవాల్సిన అవసరముండదు. దీంతో ఉద్యోగాలు మారే వారికి చాలా వరకు ఇబ్బందులు తొలగుతాయి. అక్టోబర్ 15లోగా ప్రస్తుత ఖాతాదారులకు శాశ్వత పీఎఫ్ నంబర్‌ను కేటాయించి, ఆ తర్వాత కొత్తగా చేరే వారికి కూడా దీన్నే వర్తింపజేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సాంకేతిక సాయం కోసం కేంద్ర ఐటీశాఖ పరిధిలోని ‘సి-డాక్ ’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి.