రూ. 1,800 కోట్లకు కృష్ణపట్నం పోర్టు ఆదాయం
కృష్ణపట్నం పోర్టు నుంచి బిజినెస్ బ్యూరో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) కృష్ణపట్నం పోర్టు ఆదాయం 30 శాతం వార్షిక వృద్ధితో రూ. 1,700 - 1800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ఎండీ సి. శశిధర్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి పోర్టు కంటెయినర్ టెర్మినల్ వద్ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) కి చెందిన లైనర్ సర్వీసు.. ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమానికి ఆహ్వానించిన మీడియా బృందంతో ఆయన మాట్లాడారు. గతేడాది పోర్టు ద్వారా ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల రూపేణా రూ. 1,600 కోట్లు ప్రభుత్వానికి, భారతీయ రైల్వేలకు రూ. 1,500 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం పోర్టులో బల్క్, కంటెయినర్లకు కలిపి మొత్తం 11 టెర్మినల్స్ ఉన్నాయని శశిధర్ తెలిపారు. భవిష్యత్ అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని భారీ కార్గో హాండ్లింగ్ సామర్థ్యంతో పోర్టును ఏర్పాటు చేశామని ఆయన వివరిం చారు.
ప్రస్తుతం ఇందులో 50% మాత్రమే వినియోగం అవుతున్నందున, ఇప్పట్లో విస్తరణ యోచనేదీ లేదన్నారు. ఇక, సమీపంలో ఏర్పాటవుతున్న దుగ్గరాజపట్నం పోర్టు వల్ల తమకు పోటీ ఉండబోదని శశిధర్ చెప్పారు. అలాగే సమీప భవిష్యత్‌లో నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఉద్దేశం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భూసేకరణ తర్వాతే మచిలీపట్నం పోర్టు నిర్మాణం: మచిలీపట్నం పోర్టు నిర్మాణ కాంట్రాక్టు పొందిన తమ నవయుగ గ్రూప్.. భూసేకరణ జరిగిన వెంటనే పనులు ప్రారంభిస్తుందని శశిధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఈ భూసేకరణ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుందని తాము భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ దగ్గర రాజ ధాని ఏర్పాటవుతున్నందున మచిలీపట్నం పోర్టుకి డిమాండు పెరుగుతుందన్నది తమ అంచనా అన్నారు.
మయన్మార్‌కు షిప్పింగ్ లైనర్...
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు నుంచి మయన్మార్‌లోని యాంగాన్ పోర్టుకు షిప్పింగ్ లైనర్ ‘ఎస్సీఐ కమల్’ను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (లైనర్ అండ్ ప్యాసింజర్ సర్వీసెస్ విభాగం) డెరైక్టర్ కెప్టెన్ ఎస్ నారూలా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇదే తరహా లైనర్ సర్వీసులను ఇతర ఆగ్నేయాసియా దేశాలకు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పక్షం రోజులకోసారి ఈ సర్వీసు ఉంటుం దని, డిమాండ్‌ను బట్టి వారం రోజులకోసారి ఉండేలా చూస్తామన్నారు. యాం గాన్ పోర్టు నుంచి భారత్‌కు పప్పు దినుసులు, కలప, దుస్తులు దిగుమతి అవుతాయని తెలిపారు. అలాగే ఇక్కణ్నుంచి మయన్మార్‌కు సిమెంటు, కార్లు, టెలికం పరికరాలు ఎగుమతి అవుతాయని వివరించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి షిప్పింగ్ లైనర్ సర్వీసులను ప్రారంభించడం వల్ల ఎగుమతి, దిగుమతి వ్యయాలు గణనీయంగా తగ్గగలవని కృష్ణపట్నం పోర్టు ఎండీ శశిధర్ తెలిపారు. తూర్పు తీరంలో ఈ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చిన మొదటిపోర్టు తమదేనని, దేశంలో రెండోదని తెలిపారు.