సీఏ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
* సీఏ సీపీటీలో మొదటి మూడు ర్యాంకులూ తెలుగు విద్యార్థులవే
* టాప్ టెన్‌లోనూ పలువురు విద్యార్థులు
* సీఏ ఫైనల్లో చిత్తూరు జిల్లా విద్యార్థికి నాలుగో ర్యాంకు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఏ ఫైనల్, సీఏసీపీటీ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. నవంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.విశ్వేశ్వరరావు దేశంలోనే ప్రథమ ర్యాంకు సాధించాడు.
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన సీఏ ఫైనల్, సీఏసీపీటీ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. నవంబర్‌లో నిర్వహించిన సీఏ సీపీటీ పరీక్షల్లో శ్రీకాకుళంకు చెందిన పి.విశ్వేశ్వరరావు దేశంలోనే ప్రథమ ర్యాంకు సాధించాడు. విజయవాడకు చెందిన బొల్లా మనీష రెండో ర్యాంకు సాధించింది. పి.సాయి కిరణ్, వై.మనోజ్‌రెడ్డి కూడా రెండో ర్యాంకు సాధించారు. ఎం. సూర్యప్రకాశ్, కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన చిట్లూరి మహేష్ మూడో ర్యాంకు సాధించారు. టాప్ టెన్‌లో ఇరు రాష్ట్రాల విద్యార్థులు పలువురు ఉన్నారు. సీఏ ఫైనల్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రామకుప్పానికి చెందిన కె. రమణ ఆలిండియా నాలుగో ర్యాంకు సాధించాడు.
మాస్టర్‌మైండ్స్ ప్రభంజనం
గుంటూరు: సీఏ-సీపీటీ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి ప్రకాశ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఏ-సీపీటీలో తమ విద్యార్థులు 2, 2, 3, 8, 10 ర్యాంకులు సాధించినట్టు చెప్పారు. పి.సాయి కిరణ్, వై.మనోజ్‌కుమార్ రెడ్డిలు 186 మార్కులు సాధించి 2వ ర్యాంకు కైవసం చేసుకున్నారన్నారు. అలాగే, ఎం. సూర్య ప్రకాశ్-3, కేదారపు వింద్యా వాహిని-8, డి.పూర్ణాంజనేయ సాయి-10వ ర్యాంకులు సాధించారన్నారు.
‘సూపర్‌విజ్’ ప్రతిభ
విజయవాడ: సీఏ-సీపీటీ, సీఏ ఫలితాల్లో సూపర్‌విజ్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్టు సూపర్‌విజ్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ సంస్థలకు ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు రావడం ఇది 39వ సారన్నారు. సీఏ సీపీటీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.విశ్వేశ్వరరావు ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించగా, విజయవాడకు చెందిన ఆటోడ్రైవర్ కుమార్తె బొల్లా మనీషా 2వ ర్యాంకు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన చిట్లూరి మహేశ్ మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. వీరు కాక 4, 6, 8, 8, 9, 10, 10, 10, 10, 10, 10 ర్యాంకులు సాధించినట్టు వివరించారు. సీఏ ఫైనల్లో చిత్తూరు జిల్లా రామకుప్పానికి చెందిన కె.రమణ ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, అదే జిల్లా తంబలపల్లెకు చెందిన పి.యశ్వంత్‌రెడ్డి 9వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు.