కీలక సమావేశానికి పల్లం రాజు హాజరవుతారా?
మధ్యాహ్న భోజనం, ఇతర అంశాలపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) గురువారం నిర్వహించే కీలక సమావేశానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పల్లం రాజు హాజరవుతారా అంశంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. రేపు జరుగనున్న సీఏబీఈ సమావేశంలో మధ్యాహ్న బోజన పథకంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో పల్లం రాజు హాజరుపై ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోయారని తెలుస్తోంది.
బోధన, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పలు అంశాలపై జాతీయ సంస్థకు నివేదికను పల్లం రాజు అందించాల్సి ఉంది. పల్లం రాజు రాజీనామా సమర్పించిన తర్వాత పలు సమావేశాలకు అధికారులే హాజరవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా పల్లం రాజు లేనికారణంగా పలు సమావేశాలు రద్దయ్యాయి. పల్లం రాజు హాజరుకాకుంటే ఈ సమావేశానిక జతిన్ ప్రసాద్, లేదా శశి థరూర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర కేబినెట్ నోట్ కు ఆమోదం తెలిపిన తర్వాత నుంచి విధులకు పల్లం రాజు హాజరుకావడం లేదని తెలుస్తోంది. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా పల్లం రాజు కూడా హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి రాజీనామాలను అంగీకరించాల్సిందిగా కోరినప్పటికి ఎలాంటి హామీ లభించలేదు.