సీఈఏ పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని కేంద్రం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో నాగేశ్వరన్ మార్చి 31, 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. కేవీ సుబ్రమణియన్ స్థానంలో 2022, జనవరి 28న సీఈఏగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను రూపొందించడం సీఈఏ కార్యాలయం ప్రధాన బాధ్యత. నాగేశ్వర్ సీఈఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైం సభ్యుడిగా పనిచేశారు. భారత్, సింగ్‌పూర్‌లో అనేక బిజినెస్ స్కూల్స్‌లో బోధించారు. నాగేశ్వరన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ డిగ్రీని పొందారు. 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు.