Cabinet Committee on Economic Affairs
-
రూ.6,456 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: రూ.6,456 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టబోయే మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థికవ్యవహారాల కేబినెట్ కమిటీ పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. ఒడిశా, జార్ఖండ్, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లోని మరో 300 కి.మీ.ల రైలుమార్గం నిర్మిస్తూ ఆ మార్గంలో కొత్తగా 14 రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ‘ఈ మార్గాల్లో రాకపోకలు పెరగడం వల్ల ఈ 4 రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది. ప్రజారవాణాతోపాటు ఇక్కడి ఎరువులు, బొగ్గు, ఇనుము, ఉక్కు, సిమెంట్, సున్నపురాయి తరలింపు సులభం కానుంది. దీంతో 10 కోట్ల లీటర్ల చమురు దిగుమతి భారం, 240 కోట్ల కేజీల కర్భన ఉద్గారాల విడుదల తగ్గడంతోపాటు 9.7 కోట్ల చెట్లునాటినంత ప్రయోజనం దక్కనుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల సాయం పలు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఎనిమిదేళ్లలో 15వేల మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించేందుకు ఆ రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల ఈక్విటీ సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గరిష్టంగా ఒక్కో ప్రాజెక్టుకు రూ.750 కోట్ల మేర రుణసాయం అందించనున్నారు. మరోవైపు వ్యవసాయ మౌలికవసతుల నిధి పథకం(ఏఐఎఫ్)లో స్వల్ప మా ర్పులు చేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీఓ)లకూ వర్తింపజేయాలన్న నిర్ణయానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, నేతపనివాళ్లు, గ్రామీణ కళాకారులు, హస్తకళాకారులు వంటి వారికీ ఈ పథకం ద్వారా రుణసదుపాయం కలి్పంచేందుకు అవకాశం లభిస్తుంది. రూ. 1 లక్ష కోట్ల మూల నిధితో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే. ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, సామాజిక రంగంలో విధానాల రూపకల్పనకు విస్తృత సంప్రదింపులు జరపాల్సిందిగా ప్రధాని మోదీ మంత్రులను, అధికారులను కోరారు. బుధవారం మొత్తం మంత్రిమండలిలో మోదీ ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష జరిపారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా, సమర్థమంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత పదేళ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశామని, అదే వేగంతో వచ్చే ఐదేళ్లు కూడా పనిచేద్దామని మోదీ సూచించారు. -
రైతులకు గుడ్‌న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రబీ సీజన్ 2022-23(జూలై-జూన్), మార్కెటింగ్ సీజన్ 2023-24 కాలానికి గానూ ఎంఎస్పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోదుమలు 2021-22లో క్వింటాలుకు రూ.2015 ఉండగా.. ప్రస్తుతం రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450కి చేరింది. రబీ పంటకాలానికి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065గా అంచనా వేసింది కేంద్రం. పంటలకు క్వింటాలుకు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. ► మసూర్ పప్పుకు రూ.500 ► గోధుమలకు రూ.100 ► బార్లీ రూ.100, ► శనగలు రూ.150 ► సన్ ఫ్లవర్ రూ.209 ►ఆవాలు రూ.400 రూపాయలు -
హింద్ జింక్‌కు సర్కారు గుడ్‌బై
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. హింద్ జింక్‌లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 38,000 కోట్లు సమకూరే అవకాశముంది. బుధవారం సమావేశమైన సీసీఈఏ ఇందుకు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపు లభించనున్నట్లు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లలో వాటాల వ్యూహాత్మక విక్రయం ద్వారా ఈ ఏడాది రూ. 65,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. రూ. 305 ధరలో..: బుధవారం ట్రేడింగ్‌లో హింద్ జింక్ షేరు బీఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 305 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 317ను అధిగమించింది. ప్రభుత్వం 29.5 శాతం వాటాకు సమానమైన దాదాపు 125 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ. 38,000 కోట్లు లభించే వీలుంది. కాగా.. 2002 వరకూ హింద్ జింక్ ప్రభుత్వ రంగ సంస్థగా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం 26 శాతం వాటాను స్టెరిలైట్ అపార్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించింది.డీల్ విలువ రూ. 445 కోట్లుకాగా.. తద్వారా వేదాంతా గ్రూప్ యాజమాన్య నియంత్రణను చేపట్టింది. తదుపరి వేదాంతా గ్రూప్ ఓపెన్ మార్కెట్ ద్వారా 20 శాతం వాటాను సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2003 నవంబర్‌లో ప్రభుత్వం నుంచి మరో 18.92 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఫలితంగా హెచ్‌జెడ్‌ఎల్‌లో వేదాంతా వాటా 64.92 శాతానికి ఎగసింది. కాగా.. హెచ్‌జెడ్‌ఎల్‌లో అదనంగా 5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఇటీవలే వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ పేర్కొనడం గమనార్హం! -
ఆ గనులు మాకిచ్చేయండి.. వాడనప్పుడు మీ దగ్గర ఎందుకు - కేంద్రం
తమకు కేటాయించిన గనుల్లో ఇప్పటి వరకు కార్యకలాపాలు ప్రారంభినట్టయితే ఎటువంటి జరిమానా లేకుండా వాటిని తిరిగి ఇవ్వాలంటే కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు ఉత్పత్తి సంస్థలకు తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కెబినేట్ కమిటీ ఆన్ ఎకామికల్ ఎఫైర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక సంస్థలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో కోలిండియా పరిధిలో 9 సంస్థలు ఉండగా దక్షిణ భారత దేశంలో సింగరేణితో పాటు నైవేలీ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు గతంలో కేంద్రం పలు బ్లాకులను బొగ్గు ఉత్పత్తి కోసం కేటాయించింది. వివిధ కారణాల వల్ల చాలా సంస్థలు తమకు కేటాయించిన బ్లాకులలో బొగ్గును ఉత్పత్తి చేయడం లేదు. కొన్ని బ్లాకులకు ఫీజుబులిటీ లేకపోవడం వంటి సమస్యలు ఉండగా మరికొన్ని బ్లాకులకు ఫారెస్ట్ అనుమతులు, నిధుల కొరత, భూసేకరణ తదితర సమస్యలు ఉన్నాయి. ఇలా మొత్తం 73 బ్లాకులు కేటాయించగా ఇందులో 45 బ్లాకులతో ఉత్పత్తి జరగడం లేదు. ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో కరెంటు ఉత్పత్తి తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిరుపయోగంగా ఉన్న బొగ్గు బ్లాకులను తిరిగి తమకు సరెండర్ చేయాలని కేంద్రం కోరింది. ఇలా సరెండర్‌లో వచ్చిన బ్లాకులను ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలకు కేటాయించనున్నారు. ఈ స్వచ్చంధ సరెండ్ పథకం కింద బొగ్గు బ్లాకులు కేటాయించే సంస్థలకు పెనాల్టీ, వివరణల నుంచి మినహాయింపు ఇచ్చారు. చదవండి: కియాకు మరిన్ని మెరుగులు.. కొత్త ఫీచర్లు ఇవే! -
బీపీసీఎల్ రేసులో పీఎస్‌యూలకు నో చాన్స్
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొనుగోలు రేసులో ఐఓసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. బీపీసీఎల్‌లో వాటా కొనుగోలు కోసం రూ.90,000 కోట్లు వెచ్చించాలని, ఈ స్థాయిలో వ్యయం చేయగల పీఎస్‌యూలు లేవని స్పష్టం చేశారు. బీపీసీఎల్‌తో సహా మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొన్ని పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే దిగువకు తగ్గించుకోవాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. వ్యాపారం... ప్రభుత్వ పని కాదు.. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని, 2014 నుంచి ఇదే ఉద్దేశంతో ఉన్నామని ప్రధాన్ పేర్కొన్నారు. టెలికం, విమానయాన రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతించినందువల్లే పోటీ పెరిగి వినియోగదారులకు చౌకగా సేవలందు తున్నాయని వివరించారు. బీపీసీఎల్‌కు అస్సాం లో ఉన్న నుమాలీఘర్ రిఫైనరీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అస్సామ్ ముఖ్యమంత్రి కోరారని ప్రధాన్ చెప్పారు. ఆయన కోరిక మేరకు ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని వివరించారు. బీపీసీఎల్ ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. పోటీని పెంచడానికే బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా కార్యకలాపాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ప్రధాన్ చెప్పారు. అందుకే వాటిల్లో వాటాను విక్రయిస్తున్నామని, ఫలితం గా ఆ సంస్థల పనితీరు మరింతగా మెరుగుపడుతుందని వివరించారు. ఇక్కడ జరిగిన ఏఎస్ఏ స్టీల్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. సెయిల్, ఆర్ఐఎన్ఎల్ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
జల విద్యుత్తుకు కొత్త ‘వెలుగు’!
న్యూఢిల్లీ: దేశంలో జల విద్యుదుత్పత్తిని మరింత పెంచేలా... ఈ రంగానికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వడంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన రూ.31,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్లో రెండు థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు సహా జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మించతలపెట్టిన హైడ్రో ప్రాజెక్టు కూడా ఉంది. రుణ సమస్యల్లో చిక్కుకున్న ల్యాంకో గ్రూపునకు చెందిన 500 మెగావాట్ల తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును (సిక్కిం) ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలు చేసేందుకు కూడా కేంద్రం అనుమతించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను... సమావేశానంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు తెలిపారు. దేశంలో జలవిద్యుత్‌ను ప్రోత్సహించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ హోదా 25 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులకే ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు హోదా ఇస్తున్నారు. ఈ హోదా ఉంటే ఆర్థిక సహకారం, తక్కువ వడ్డీకి రుణాలు వంటి పలు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 25 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో సోలార్, పవన, 25 మెగావాట్ల వరకు జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులు కలిపి 74 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీనికి అదనంగా 45 గిగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తోడు కానుంది. 2022 నాటికి 175 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని సాధించాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే, భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులక్కూడా ఈ హోదాను కట్టబెట్టడంతో 2022 నాటికి 225 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ విభాగంలో సాధించనుంది. ప్రాజెక్టుల జీవితకాలాన్ని 40 ఏళ్లకు పెంచుకుని, టారిఫ్ రేట్లు తగ్గించుకునేందుకు కూడా ప్రభుత్వ నిర్ణయాలు వీలు కల్పిస్తాయి. రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్యవధి 18 ఏళ్లకు పెరుగుతుంది. ప్రస్తుతం జలవిద్యుత్ టారిఫ్‌లు ఇతర వనరులతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో ఇకపై ఇవి క్రమబద్ధీకరణ చెందనున్నాయి. భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను డిస్కమ్‌లకు విక్రయించగలుగుతాయి. డిస్కమ్‌లు నిర్ణీత శాతం మేర రెన్యువబుల్ ఎనర్జీని కొనుగోలు చేయాలి. లేదంటే రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 200 మెగావాట్ల వరకు ఒక్కో మెగావాట్‌కు రూ.1.5 కోట్లు, అంతకుమించితే ఒక్కో మెగావాట్‌కు రూ.కోటి మేర నిధుల సాయానికి కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ల్యాంకో తీస్తా ప్రాజెక్టు ఎన్హెచ్పీసీకి ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌ను ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలు చేసేందుకు సీసీఈఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సిక్కింలోని తీస్తా స్టేజ్–6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై ఎన్‌హెచ్‌పీసీ రూ.5,748 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఇందులో ల్యాంకో తీస్తా హైడ్రో ప్రాజెక్టు కొనుగోలుకు రూ.907 కోట్లు వ్యయం చేయనుంది. ఈ ప్రాజెక్టులో మిగిలిన నిర్మాణ పనుల పూర్తికి గాను రూ.3,863 కోట్లను ఖర్చు చేయనుంది. 125 మెగావాట్ల నాలుగు యూనిట్లతో కూడిన (500 మెగావాట్లు) ఈ ప్రాజెక్టులో ఏటా 2,400 మిలియన్ల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఉన్న చీనాబ్ నదిపై చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ 624 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,287 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు కూడా సీసీఈఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఎన్‌హెచ్‌పీసీ రూ.630 కోట్ల పెట్టుబడులతో వాటా తీసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పునాదిరాయి వేసిన విషయం గమనార్హం. థర్మల్ ప్రాజెక్టులు బిహార్‌లోని బుక్సర్‌లో ఒక్కోటి 660 మెగావాట్ల రెండు యూనిట్లను రూ.10,439 కోట్లతో ప్రభుత్వరంగ ఎస్‌జేవీఎన్ అనుబంధ కంపెనీ ఎస్‌జేవీఎన్ థర్మల్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మార్పులకు కారణమవుతుందని సీసీఈఏ పేర్కొంది. 2023–24 నుంచి ఈ ప్రాజెక్టు పనిచేయడం ఆరంభమవుతుంది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 660 మెగావాట్ల రెండు సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను రూ.11,089 కోట్ల వ్యయ అంచనాలతో ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వాటాల అమ్మకంపై అంతిమ అధికారం కమిటీకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంపై నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు గాను ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అధికారాలను కట్టబెడుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు విక్రయించాలి, ధర, ఎంత మొత్తం షేర్లను విక్రయించాలన్న నిర్ణయాలను ఈ యంత్రాంగం తీసుకోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) 2017లో ఏర్పాటైంది. ఇందులో రవాణా మంత్రి, సంబంధిత కంపెనీపై అధికారాలున్న శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. కేవలం నియమ, నిబంధనలనే ఈ కమిటీ ఇప్పటి వరకు నిర్ణయిస్తుండేది. సీసీఈఏ తాజా నిర్ణయంతో ఇకపై ప్రభుత్వరంగ సంస్థను ఎంత ధరకు విక్రయించాలి, ఎన్ని వాటాలను విక్రయించాలన్న నిర్ణయాలను కూడా ఏఎం తీసుకోనుంది. దీంతో వేగంగా విక్రయం సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. పవన్‌హన్స్, ఎయిర్ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, స్కూటర్స్ ఇండియా, భారత్ పంప్స్ కంప్రెషర్స్, సెయిల్‌కు చెందిన పలు యూనిట్లలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. -
ఆ గ్యాస్ నిక్షేపాలను ఆర్‌ఐఎల్‌కే ఇవ్వండి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన కేజీ డీ6 బ్లాకులో కనుగొన్న మూడు గ్యాస్ బావుల అభివృద్ధి సాంకేతిక వివాదంతో నిలిచిపోయిన నేపథ్యంలో... గడువు సడలించి, ఉత్పత్తి చేసుకోవడానికి ఆర్ఐఎల్ను అనుమతించాలని చమురు శాఖ కేంద్ర మంత్రివర్గాన్ని కోరనుంది. ధీరూభాయ్ 29, 30, 31 అనే పేర్లు పెట్టిన ఈ బావుల్లో 145 కోట్ల డాలర్ల విలువైన నిక్షేపాలున్నట్లు అంచనా. వీటిలో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించాలని కోరుతూ 2010లో ఆర్ఐఎల్ లాంఛనంగా చమురు శాఖకు దరఖాస్తు పంపింది. అయితే నిర్ణీత ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించని కారణంగా ఆర్ఐఎల్ అభ్యర్థనను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) తిరస్కరించింది. డ్రిల్ స్టెమ్ టెస్ట్ (డీఎస్టీ) నిర్వహణకు రిలయన్స్ అంగీకరించినప్పటికీ, గడువు ముగిసిపోయిందని డీజీహెచ్ పేర్కొంది. దాదాపు 34,500 కోట్ల ఘనపు అడుగుల మేర ఉన్న గ్యాస్ నిక్షేపాల వెలికితీతకు ఆర్ఐఎల్ను నిరాకరించడం, కొత్తగా బిడ్డింగ్ నిర్వహించడం వల్ల బావుల అభివృద్ధి ఆలస్యమవుతుందని చమురు శాఖ భావిస్తోంది. ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం)ను కోరితే ఉత్పత్తి మరింత జాప్యమవుతుందని యోచిస్తోంది. కనుక, ఉత్పత్తి పంపిణీ ఒప్పందం(పీఎస్సీ)లోని గడువులను సవరించి, ఆర్ఐఎల్కు అవకాశం ఇవ్వాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీని చమురు శాఖ కోరనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఉల్లి ఎగుమతి ధర పెంపు
* నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి ఉల్లి, బంగాళాదుంప న్యూఢిల్లీ: నిత్యావసర ఆహారపదార్థాల ధరలు పెరుగుతుండటంపై ఆందోళనకు గురవుతున్న కేంద్ర ప్రభుత్వం.. వాటిని అదుపులో పెట్టేందుకు నడుం బిగించింది. అందులో భాగంగా ఉల్లిగడ్డల కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను టన్నుకు 500 డాలర్లకు(రూ. 29,773) పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశీ మార్కెట్లో వీటి సరఫరా మెరుగవడంతో పాటు ధర కూడా తగ్గుతుందని భావిస్తోంది. కనీస ఎగుమతి ధర కన్నా తక్కువ ధరకు ఎవరూ ఎగుమతి చేయకూడదు. యూపీఏ ప్రభుత్వం మార్చి నెలలో ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించగా.. నెలక్రితం వాటి ఎగుమతులకు అనుమతిస్తూ, ఎంఈపీని 300 డాలర్లుగా నిర్ణయించారు. మరోవైపు, ధరల తగ్గింపు లక్ష్యంగా బుధవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని.. * ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి చేర్చారు. తద్వారా వాటి లభ్యత పెరగడంతో పాటు, వాటిని అక్రమంగా నిల్వ చేయడం శిక్షార్హమవుతుంది. బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడం సాధ్యమవుతుంది. చట్టప్రకారం ఎంత మొత్తాల్లో నిల్వ చేయొచ్చనేది రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. 1999 -2004 మధ్య కూడా ఉల్లి, బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోనే ఉన్నాయి. * ఆహార భద్రత చట్టం అమల్లో లేని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసేందుకు అదనంగా 50 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలి. రేపు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం సాక్షి, హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ కోసం తీసుకునే చర్యలపై చర్చించడానికి అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 4న ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం కూడా హాజరుకానుంది. రాష్ర్ట ఆర్థిక, పౌరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తోపాటు పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి, ఇతర అధికారులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ర్టంలో కూడా బియ్యంతోపాటు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. -
హెచ్ఎంటీ మెషీన్‌టూల్స్ సిబ్బందికి వరాలు
న్యూఢిల్లీ: హెచ్ఎంటీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం వరాలను ప్రకటించింది. 1997 నాటి వేతన సవరణను అమలు చేయడానికి ఓకే చెప్పింది. శుక్రవారం ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు కంపెనీలో సిబ్బంది పదవీ విరమణ వయసును ఇప్పుడున్న 58 నుంచి 60కి పెంచేందుకు సైతం పచ్చజెండా ఊపింది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం రూ. 75 కోట్లు, 1997 నాటి పే రివిజన్ అమలుకు అవసరమైన నిధుల కోసం మరో రూ.61.04 కోట్ల ప్రణాళికేతర రుణాలను కూడా ఇవ్వడానికి అంగీకరించింది. రిటైర్మెంట్ వయసు పెంపుపై కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని, దీనికి సబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు కూడా అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కంపెనీ తీసుకున్న రూ.38.04 కోట్ల ప్రభుత్వం రుణంపై ఈ ఏడాది మార్చి 31 వరకూ వడ్డీ మాఫీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ 2000 సంవత్సరంలో హెచ్ఎంటీ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థగా మారింది. హైదరాబాద్, బెంగళూరు, అజ్మీర్ తదితర చోట్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. గతేడాది జూన్ 30నాటికి సంస్థలో 2,806 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. హిందుస్తాన్ పేపర్‌కు 75 కోట్ల గ్రాంట్: హిందుస్తాన్ పేపర్ కార్పొరేషన్‌కు చెందిన కచ్చార్ పేపర్ మిల్(అసోంలో ఉంది)కు ఏటా రూ.75 కోట్ల ఆర్థిక సహయాన్ని(గ్రాంట్)ను ఇచ్చేందుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ప్రధానంగా అదనపు నిర్వహణ వ్యయాల నిమిత్తం దీన్ని ప్రకటించింది. ఐటీఐకి రూ.200 కోట్ల రుణం: నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(ఐటీఐ)కు రూ.200 కోట్ల చౌక వడ్డీ రుణాన్ని ఇవ్వడానికి కేంద్రం ఆమోదముద్ర వేశారు. సిబ్బందికి జీతాల చెల్లింపులు ఇతరత్రా అవసరాలకు దీన్ని ఇవ్వనున్నారు. గతేడాది డిసెంబర్ నాటికి ఐటీఐలో 7,633 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హిందుస్తాన్ ఫొటో ఫిల్మ్స్‌లో వీఆర్ఎస్ ప్యాకేజీ: ప్రభత్వ రంగ నష్టజాతక కంపెనీ హిందుస్తాన్ ఫొటో ఫిల్మ్స్‌లో సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)ను అమలు చేయడానికి కేంద్రం ఓకే చెప్పింది. ఇందుకోసం రూ.182 కోట్ల వీఆర్ఎస్ ప్యాకేజీకి ఆమోదం ముద్ర వేసింది. 2012 మార్చి నాటికి కంపెనీలో 714 మంది ఉద్యోగులు ఉన్నారు. ‘ఫ్యాక్ట్’కు పరిహారం...: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెంకోర్(ఫ్యాక్ట్)కు అదనపు పరిహారాన్ని ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. పోషకాధార సబ్సిడీ విధానం కింద నిర్దిష్టకాలానికిగాను కాంప్లెక్స్ ఎరువులను నాఫ్తాతో ఉత్పత్తి చేస్తున్నందుకు ఈ పరిహారాన్ని ఇస్తున్నారు. 2013-14 జూన్ 30 నుంచి అక్టోబర్ 4 కాలానికి తాజా నిర్ణయం వర్తిస్తుంది.