హెచ్‌ఎంటీ మెషీన్‌టూల్స్ సిబ్బందికి వరాలు | HMT employees to get revised wages; retirement age raised to 60 | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంటీ మెషీన్‌టూల్స్ సిబ్బందికి వరాలు

Published Sat, Mar 1 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

హెచ్‌ఎంటీ మెషీన్‌టూల్స్ సిబ్బందికి వరాలు

హెచ్‌ఎంటీ మెషీన్‌టూల్స్ సిబ్బందికి వరాలు

న్యూఢిల్లీ: హెచ్‌ఎంటీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం వరాలను ప్రకటించింది. 1997 నాటి వేతన సవరణను అమలు చేయడానికి ఓకే చెప్పింది. శుక్రవారం ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు కంపెనీలో సిబ్బంది పదవీ విరమణ వయసును ఇప్పుడున్న 58 నుంచి 60కి పెంచేందుకు సైతం పచ్చజెండా ఊపింది.

వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం రూ. 75 కోట్లు, 1997 నాటి పే రివిజన్ అమలుకు అవసరమైన నిధుల కోసం మరో రూ.61.04 కోట్ల ప్రణాళికేతర రుణాలను కూడా ఇవ్వడానికి అంగీకరించింది. రిటైర్‌మెంట్ వయసు పెంపుపై కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని, దీనికి సబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు కూడా అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కంపెనీ తీసుకున్న రూ.38.04 కోట్ల ప్రభుత్వం రుణంపై ఈ ఏడాది మార్చి 31 వరకూ వడ్డీ మాఫీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ 2000 సంవత్సరంలో హెచ్‌ఎంటీ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థగా మారింది. హైదరాబాద్, బెంగళూరు, అజ్మీర్ తదితర చోట్ల తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి. గతేడాది జూన్ 30నాటికి సంస్థలో 2,806 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

 హిందుస్తాన్ పేపర్‌కు 75 కోట్ల గ్రాంట్: హిందుస్తాన్ పేపర్ కార్పొరేషన్‌కు చెందిన కచ్చార్ పేపర్ మిల్(అసోంలో ఉంది)కు ఏటా రూ.75 కోట్ల ఆర్థిక సహయాన్ని(గ్రాంట్)ను ఇచ్చేందుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ప్రధానంగా అదనపు నిర్వహణ వ్యయాల నిమిత్తం దీన్ని ప్రకటించింది.  
 ఐటీఐకి రూ.200 కోట్ల రుణం: నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(ఐటీఐ)కు రూ.200 కోట్ల చౌక వడ్డీ రుణాన్ని ఇవ్వడానికి కేంద్రం ఆమోదముద్ర వేశారు. సిబ్బందికి జీతాల చెల్లింపులు ఇతరత్రా అవసరాలకు దీన్ని ఇవ్వనున్నారు. గతేడాది డిసెంబర్ నాటికి  ఐటీఐలో 7,633 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

 హిందుస్తాన్ ఫొటో ఫిల్మ్స్‌లో వీఆర్‌ఎస్ ప్యాకేజీ: ప్రభత్వ రంగ నష్టజాతక కంపెనీ హిందుస్తాన్ ఫొటో ఫిల్మ్స్‌లో సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్)ను అమలు చేయడానికి కేంద్రం ఓకే చెప్పింది. ఇందుకోసం రూ.182 కోట్ల వీఆర్‌ఎస్ ప్యాకేజీకి ఆమోదం ముద్ర వేసింది. 2012 మార్చి నాటికి కంపెనీలో 714 మంది ఉద్యోగులు ఉన్నారు.

 ‘ఫ్యాక్ట్’కు పరిహారం...: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెంకోర్(ఫ్యాక్ట్)కు అదనపు పరిహారాన్ని ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. పోషకాధార సబ్సిడీ విధానం కింద నిర్దిష్టకాలానికిగాను కాంప్లెక్స్ ఎరువులను నాఫ్తాతో ఉత్పత్తి చేస్తున్నందుకు ఈ పరిహారాన్ని ఇస్తున్నారు. 2013-14 జూన్ 30 నుంచి అక్టోబర్ 4 కాలానికి తాజా నిర్ణయం వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement