‘దుర్గానికి’ కొత్త సొబగులు
ఐటీ కారిడార్‌కు ఆధునిక హంగులు
సాక్షి, హైదరాబాద్: ఐటీ కారిడార్‌కు సరికొత్త సొబగులద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆధునిక హంగులతో కూడిన కేబుల్ స్ట్రేబిడ్జి (వేలాడే వంతెన)తో పాటు దుర్గం చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టనుంది. రూ.184 కోట్లతో నిర్మించనున్న కేబుల్ స్ట్రేబిడ్జి, రూ.3.5 కోట్లతో చేపట్టనున్న దుర్గం చెరువు సుందరీకరణ పనులకు మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.
కేబుల్ స్ట్రే బ్రిడ్జి..
రెండేళ్లలో పూర్తికానున్న ఈ వంతెన వినియో గంలోకి వస్తే ఐల్యాబ్స్ జంక్షన్(ఇనార్బిట్‌మాల్ చివర) నుంచి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు కొత్త అనుభూతితో కూడిన ప్రయాణ సదుపాయం కలగనుంది. బ్రిడ్జి మొత్తం పొడవు దాదాపు కిలోమీటర్ కాగా.. 365.85 మీటర్ల మేర వేలాడే వంతెన ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ జంజాటం తప్పుతుంది. పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకోనుంది. ముంబై, గోవా, కోల్‌కతా, జమ్మూకశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమం.
-ఈ బ్రిడ్జి వల్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లే వారికి సదుపాయంగా ఉంటుంది.
- జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.
- రోడ్ నంబర్ 45 వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌తో బ్రిడ్జిని అనుసంధానించడం వల్ల రోడ్ నంబర్ 45, హైటెక్‌సిటీ మధ్య ఇబ్బందుల్లేని సాఫీ ప్రయాణం అందుబాటులోకి రానుంది.
- ఈ బ్రిడ్జి డిఫెక్ట్ లయబిలిటీ పదేళ్లు. ఆలోగా ఎలాంటి మరమ్మతులు అవసరమైనా కాంట్రాక్టు సంస్థే చేయాల్సి ఉంటుంది.
సుందరీకరణ..
పలు ఆక్రమణలతోపాటు కాలుష్య కాసారంగా మారిన దుర్గం చెరువు సుందరీకరణలో భాగంగా గుర్రపుడెక్క తొలగింపు, శుద్ధి కార్యక్రమాలకు రూ.50.80 లక్షలు ఖర్చు చేయనున్నారు. సీఎస్సార్లోభాగంగా రహేజా ఐటీ పార్కు ఈ నిధుల్ని కేటాయించింది. ఇప్పటికే పనులు ప్రారంభమైనా ఇప్పుడు లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు.
దాదాపు రూ.2 కోట్లతో దుర్గం చెరువు చుట్టూ 2.2 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే పార్కు, యోగా కేంద్రం తదితర పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. వీటితోపాటు రూ.90 లక్షలతో గణేశ్ నిమజ్జనాలకు ప్రత్యేక కొలను నిర్మించనున్నారు. దీనిలో 3 వేలకు పైగా చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు.
బ్రిడ్జి ముఖ్యాంశాలు..
అప్రోచ్‌లతోపాటు బ్రిడ్జి పొడవు 1,048 మీ.
కేబుల్ స్ట్రేబిడ్జి 365.85 మీ.
అప్రోచ్ వయడక్ట్ పొడవు 300 మీ.
సాలిడ్ అప్రోచెస్ 1,048 మీ.
నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు టెండర్
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లేన్ల ఫ్లై ఓవర్(ఎలివేటెడ్ కారిడార్)కు జీహెచ్ఎంసీ మంగళవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే దుర్గం చెరువు వరకు సులభంగా వెళ్లవచ్చు. ఈపీసీ పద్ధతిలో జాతీయస్థాయి టెండర్లను ఆహ్వానించారు. ఏడాదిన్నర కాలంలోగా నిర్మాణాన్ని పూర్తిచేయాలి. డిఫెక్ట్ లయబిలిటీ రెండేళ్లు. కాంట్రాక్టులో భాగంగా సర్వే, ఇన్వెస్టిగేషన్, సమగ్ర డిజైన్లతోపాటు నిర్మాణ పనులు పూర్తిచేయాలి. అంచనా వ్యయం రూ.82.14 కోట్లు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి బిడ్ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలిలా ఉన్నాయి.
టెండర్ ప్రారంభం: 26–04–2017(సాయంత్రం 5 గంటల నుంచి)
ప్రీ బిడ్ సమావేశం: 04–05–2017(మధ్యాహ్నం 3 గంటలు)
టెండర్ చివరి తేదీ: 22–05–2017(మధ్యాహ్నం 2 గంటల వరకు డౌన్లోడ్. 3 గంటలలోపు బిడ్ల దాఖలు)
టెక్నికల్ బిడ్ల ఓపెనింగ్: 22–05–2017(సాయంత్రం 4 గంటల తర్వాత)
ప్రైస్ బిడ్ల ఓపెనింగ్: 25–05–2017(సాయంత్రం 4 గంటల తర్వాత)