కాల్ టు సీపీ 94906 16000
నగరంలో పోలీసుల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నడుం బిగించారు. ఖాకీల వల్ల ఎలాంటి ఇబ్బందులు, వేధింపులుఎదురైనా స్వయంగా తనకే ఫిర్యాదు చేయాలంటూ ప్రజలు, వ్యాపారులకువిజ్ఞప్తి చేశారు.
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఏవైనా అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే నేరుగా తనకే సమాచారం ఇవ్వాలని నగర కొత్వాల్ అంజినీ కుమార్ కోరారు. తన ఫోన్ నంబర్ 94906 16000కు ఉప్పందించాలంటూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అవినీతి ఆరోపణలు రుజువైన సైదాబాద్ ఠాణా కానిస్టేబుల్ అహ్మద్ బిన్ అమర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు హోంగార్డు భోగి నాగరాజును విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం గస్తీ విధుల్లో ఉన్న వీరిద్దరూ శివగంగ థియేటర్ రోడ్‌లోని ఎస్బీఐ వద్ద రహదారి పక్కన టీ–షర్ట్స్ విక్రయిస్తున్న వ్యక్తి నుంచి ఓ టీషర్ట్ తీసుకున్న వీరు.. డబ్బు చెల్లించలేదు. దీన్ని స్థానికులు వీడియో తీసి ట్విటర్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. విచారణకు ఆదేశించిన ఆయన.. అవినీతి నిరూపితం కావడంతో ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవినీతి చర్యల్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.