మళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన క్యాంపాకోలా కేసు
న్యూఢిల్లీ: ముంబైలోని వర్లి క్యాంపాకోలా ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన 40 ఫ్లాట్ల యాజమానులు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వీరంతా శనివారం లోపు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించడం తెలిసిందే. బాధితుల పిటిషన్పై మంగళవారం విచారణ నిర్వహిస్తామని జగదీశ్ సింగ్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. క్యాంపాకోలా ప్రాంతంలో అక్రమంగా వెలిసిన అంతస్తులను ఖాళీ చేయించేందుకు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది.
జూన్ రెండు లోపు భవనాలను ఖాళీ చేసి దక్షిణవార్డు కార్యాలయంలో తాళాలు అప్పగించాలని అక్రమ ఫ్లాట్ల యాజమానులకు నోటీసులు జారీ చేసింది. తాళాలు అప్పగించని వారిపై ఏం చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టునే తిరిగి ఆశ్రయిస్తామని ప్రకటించింది. మే 31లోపు ఇళ్లను ఖాళీ చేస్తామని ఎంసీజీఎంకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని క్యాంపాకోలా వాసులను అత్యున్నత న్యాయస్థానం గత నవంబర్లో ఆదేశించడం తెలిసిందే.