‘కాంపాకోలా’వాసులకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: మే 31లోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు గత తీర్పును వ్యతిరేకిస్తూ ముంబైలోని ‘కాంపాకోలా’ హౌజింగ్ సొసైటీ వేసిన పిటిషన్ను మంగళవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న క్యురేటివ్ పిటిషన్పై తీర్పు వెలువడేవరకైనా అక్కడి అక్రమ ఫ్లాట్లను కూలగొట్టకుండా ఆదేశాలు జారీ చేయాలన్న అభ్యర్థనను కూడా జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ సీ నాగప్పన్ల ధర్మాసనం తోసిపుచ్చింది. అంతకుముందు వాదనల్లో భాగంగా.. ‘ఇది మానవత్వానికి సంబంధించిన పెద్ద సమస్య. 140 కుటుంబాలను ఖాళీ చేయాలంటున్నారు.
వేరే ఎక్కడా వారు ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ నేను చట్టపరమైన అంశాలనేమీ లేవనెత్తడం లేదు. ఇది దాదాపు క్షమాభిక్ష పిటిషన్ లాంటిది’ అని ‘కాంపాకోలా’ పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దానికి ‘ప్రతీ కేసులోనూ మానవత్వమనే అంశం ఉంటుంది. లేదంటే మనకు న్యాయస్థానాల అవసరమే లేదు’ అంటూ ధర్మాసనం స్పందించింది. ఆ అక్రమ ఫ్లాట్ల యజమానులు వాటిని ఖాళీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నారని, అయితే, ఆ ఫ్లాట్లను పడగొట్టకుండా సంబంధిత అధికారులను ఆదేశించాలంటూ ఆ ఫ్లాట్ల నివాసితుల సంఘం సుప్రీంకోర్టును కోరింది. ముంబైలో కాంపాకోలా హౌజింగ్ సొసైటీ పేరుతో 1981-89 మధ్య ఒక్కో భవనంలో ఆరు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని, ఒక్కో భవనంలో 15 నుంచి 20 వరకు అంతస్తులు నిర్మించారు. అక్రమ ఫ్లాట్లను కూల్చేయాలంటూ గత సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ముంబై మున్సిపల్ అధికారులను ఆదేశించింది.