కార్మికులపై పక్షపాత ధోరణి వీడాలి
ఆమదాలవలస రూరల్ : కార్మికులపై కాన్‌కాస్ట్ యాజమాన్యం పక్షపాత ధోరణి వీడాలరి కాన్‌కాస్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టి.కృష్ణారావు, కార్యదర్శి బి.నాగేశ్వరరావు కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని దూసి గ్రామంలో గల కాన్‌కాస్ట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట శుక్రవారం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయపరమైన చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని 28 రోజులుగా ధర్నాలు చేపడుతున్నా యాజమాన్యం స్పందించకపోవడం దారుణమన్నారు.
నూతన వేతన ఒప్పందం అమలు గురించి జేసీఎల్ జాయింట్ సమావేశానికి యాజమాన్యం హాజరుకావడం లేదని తెలిపారు. నిరసనలో పాల్గొన్న సుమారు 140 మంది కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించకుండా యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. వేరొక యూనియన్ కార్మికులకు పని కల్పించి ఐఎఫ్టీయూ కార్మికుల పట్ల వివక్ష చూపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.