‘చదువుకోవాలి’ దర్శకుడికి సీఎం అభినందన
హైదరాబాద్: కెనడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో విద్యార్థి విభాగ పోటీల్లో ఎక్స్లెన్సీ అవార్డు పొందిన ‘చదువుకోవాలి’ చిత్ర దర్శకుడు వెంకటేశ్వరరావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. గురువారం రాత్రి ఈ సినిమా ఆడియో సీడీలను సీఎం ఆవిష్కరించారు. చదువు ప్రాముఖ్యతపై సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన తెలంగాణ దర్శకునికి అంతర్జాతీయ అవార్డు దక్కడం అభినందనీయమని కేసీఆర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఐఎఫ్ఎస్ అధికారి నర్సింగరావు, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, డిగ్రీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ హరినాథశర్మ తదితరులు పాల్గొన్నారు. విద్య ప్రాధాన్యాన్ని తెలిపే ఈ చిత్రానికి గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయని చిత్ర దర్శకుడు వెంకటేశ్వరరావు తెలిపారు. వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి కూడా అభినందించారు.