ఇంత మోసమా చంద్రబాబూ?
రుణాలు మాఫీకాకపోవడంపై దుమ్మెత్తిపోసిన డ్వాక్రా మహిళలు
తూ.గో., అనంతపురం జిల్లాల్లో ధర్నాలు
షరతులు లేని రుణమాఫీ అమలుకు డిమాండ్
మామిడికుదురు/గుత్తి/బుక్కపట్నం: తమ రుణాల రద్దుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విస్మరించడంపై డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోశారు. షరతులు లేని రుణ మాఫీ కోసం సోమవారం ఉద్యమించారు. రుణాలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో టీడీపీ మహిళా నాయకులు సైతం పాల్గొనడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన 40 డ్వాక్రా గ్రూపులకు చెందిన దాదాపు 300 మంది మహిళలు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద బైఠాయించారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘రుణాలు రద్దు చేయమని మేము మిమ్మల్ని అడిగామా? రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చింది మీరే. తీరా అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారా?’ అంటూ మండిపడ్డారు. సక్రమంగా సాగుతున్న డ్వాక్రా గ్రూపుల లావాదేవీలు నిలిచిపోవడానికి రుణమాఫీ హామీ కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్నా అనంతరం రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ ఎంపీడీఓ ధనలక్ష్మీదేవికి వినతిపత్రం ఇచ్చారు. టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు మొల్లేటి పార్వతి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మొల్లేటి అలివేలు మంగతో పాటు కంచి విజయలక్ష్మి, గుబ్బల వరలక్ష్మి, జక్కంపూడి శాంతమ్మ, కంచి లక్ష్మీకుమారి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఏజెన్సీలోని రాజవొమ్మంగిలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూడా మహిళలు రుణమాఫీ అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్లలోని 28 డ్వాక్రా సంఘాల మహిళలు గుత్తిలోని సిండికేట్ బ్యాంకును గంటన్నరపాటు ముట్టడించారు. రాస్తారోకో, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ర్యాలీగా వెళ్లి ఐకేపీ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ఇలా చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు.