రెండు తెలుగు రాష్ట్రాల్లో కేన్సర్ ఉచిత స్క్రీనింగ్
బంజారాహిల్స్/రాయదుర్గం: రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ కార్మికులు, మెగా అభిమానుల కోసం కేన్సర్ ఉచిత స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు సినీనటుడు చిరంజీవి ప్రకటించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లోని స్టార్ ఆస్పత్రి కేన్సర్ సెంటర్ సహకారంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని బ్లడ్ బ్యాంకులో, నానక్‌రాంగూడ స్టార్ ఆస్పత్రి కేన్సర్ సెంటర్ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
ప్రాణాంతకమైన కేన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని, అందుకే ఈ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని చెప్పారు. జూలై 9న జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో స్క్రీనింగ్ ఉంటుందని, రోజూ వెయ్యి మందికి కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రెండుమూడు రోజుల్లో సినీ కార్మి క సంఘాల నాయకులతో సమావేశమై, స్క్రీనింగ్ కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు.
16న వైజాగ్‌లో, 23న కరీంనగర్లో..
మెగా అభిమానులకోసం జూలై 9న హైదరాబాద్‌లో, 16న వైజాగ్‌లో, 23న కరీంనగర్లో కేన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో ఈ స్క్రీనింగ్ నెలకు ఒకసారి చేపడతామని, క్రమక్రమంగా ఈ సేవలను మరింతగా విస్తరించాలని నిర్ణయించామని వెల్లడించారు. స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించడానికి ముందుకొచ్చిన స్టార్ ఆస్పత్రి యాజమాన్యాన్ని చిరంజీవి అభినందించారు.
స్టార్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నెం గోపీచంద్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగు నెలలపాటు ఈ స్క్రీనింగ్ చేపడతామన్నారు. పొగ తాగేవారు, పాన్ మసాలా నమిలేవాళ్లను ముందుగా గుర్తించి స్క్రీనింగ్ చేస్తామని, మహిళలు కూడా స్వయంగా తమకు తామే గుర్తుపట్టే విధంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. కేన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత తొందరగా నియంత్రించవచ్చన్నారు.