candidate photo
-
ఫొటో చూసి ఓటేయవచ్చు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వివిధ ప్రత్యేకతలను సంతరించుకోనున్నాయి. ప్రజలు ఎవరికి ఓటు వేసిందీ తెలుసుకునేందుకు వీవీప్యాట్లు వినియోగించనుండటం, నగరంలో దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ‘వాదా’యాప్ ఉపయోగపడనుండటం, అంధులకు బ్రెయిలీ లిపిలో ఎపిక్ కార్డులు జారీ చేస్తుండటం గురించి తెలిసిందే. ఈసారి అభ్యర్థి ఫొటో చూసి కూడా ఓటేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ఈవీఎంలలో అభ్యర్థి పేరు, గుర్తుతోపాటు 2్ఠ2.5 సెం.మీల ఫొటో కూడా ఉంటుంది. నోటా వద్ద మాత్రం ఫొటో స్థానంలో ఖాళీగా ఉంటుంది. అభ్యర్థుల పేర్లు అక్షరక్రమంలో తొలుత జాతీయపార్టీల అభ్యర్థులవి, తర్వాత ప్రాంతీయ పార్టీలవి, ఆ తర్వాత ఇండిపెండెంట్లు లేదా ఇతర పార్టీలవి ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఓటరు గందరగోళానికి గురికాకుండా ఒక నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థుల్లో ఒకరి కంటే ఎక్కువమందికి ఒకే పేరు, లేదా దగ్గరి పోలికలతో ఉన్న పేరు ఉంటే ప్రజలు ఓటు వేసేటప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను పోటీ చేసే అభ్యర్థులు తాజాగా తీయించుకున్న తమ స్టాంప్ సైజ్ కలర్‌ఫొటోను సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరో నాలుగు రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఫొటోలు పెట్టినా రీ పోలింగ్ గతేడాది మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి,హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సాధారణ బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల ఫొటోలుంచారు. ఎన్నికల విధుల్లోని అధికారుల అశ్రద్ధ కారణంగా బ్యాలెట్ పత్రాల్లో ఒక అభ్యర్థి పేరున్న చోట మరో అభ్యర్థి ఫొటో ముద్రించారు. ఎన్నికల బరిలో ఉన్న ఆదిలక్ష్మయ్య, పాపన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారయ్యాయి. దీంతో రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఓటర్లు రెండుసార్లు ఓట్లు వేయాల్సి రావడంతోపాటు ప్రభుత్వానికి బోలెడు వ్యయప్రయాసల్ని ఈ ఎలక్షన్ మిగిల్చింది. -
నో గందరగోళం ఈవీఎంపై అభ్యర్థి చిత్రం
రానున్న విధానసభ ఎన్నికల్లో ఓటింగ్ విషయంలో భారీ సంస్కరణే జరిగేలా ఉంది. ఈవీఎంలో అభ్యర్థి పేరు, పార్టీ చిహ్నంతో పాటు వారి ఫోటోను కూడా ముద్రించాలని ఈసీ నిర్ణయించింది. దీని వల్ల పలు రకాల తర్జనభర్జనలకు పుల్‌స్టాప్ పడనుంది. సాక్షి, బెంగళూరు: ఎన్నికల్లో ఓటర్లను గందరగోళ పరిచి ఎలాగైనా ఓట్లను రాబట్టేందుకు కొన్ని పార్టీలు పన్నాగాలు వేస్తుంటాయి. తమ ప్రత్యర్థిని బోల్తా కొట్టించాలని అదే పేరుతో ఉన్న మరికొందరు అనామకులను పోటీకి నిలుపుతుంటాయి. ఆ విధంగా ఓటర్లను గందరగోళానికి గురిచేసి ప్రత్యర్థికి రావాల్సిన ఓట్లను తమ ఖాతాలోకి వచ్చేలా చేస్తుంటాయి. ఇలాంటి చెత్త వ్యూహాలకు చెక్ చెప్పేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఒక వినూత్న ఆలోచన చేసింది. త్వరలో జరిగే కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తులతో పాటు వారి ఫొటోలు కూడా ముద్రించేలా ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ప్రయోగాన్ని అమలు చేయనుంది. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులను గుర్తించడంలో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. తద్వారా ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తమకు నచ్చిన అభ్యర్థికే ఓటు వేసేలా వెసులుబాటు కల్పించనుంది. వరుస క్రమంలో ఇలా... ప్రతి ఈవీఎంపై పేరుతో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫొటో, సంబంధిత పార్టీ గుర్తు ఉంటుంది. ఈవీఎంపై ఫొటో 2.5 సెంటీ మీటర్ల పరిమాణంలో అభ్యర్థుల పేర్ల పక్కనే ఫోటోలను ముద్రిస్తారు. అభ్యర్థుల పేర్లను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. అక్షరాల వరుస ఆధారంగా తొలుత జాతీయపార్టీ అభ్యర్థుల పేర్లు అనంతరం ప్రాంతీయ పార్టీ అభ్యర్థుల పేర్లు, ఆపై మిగిలిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, వారి ఫొటోలను ముద్రిస్తారు. అన్నిచోట్లా వీవీ ప్యాట్లు ఇకపై ఓటర్ ఎవరికి ఓటు వేశాడో నిర్ధారించుకునే వెసులుబాటు కూడా రానుంది. ఓటు వేసిన తర్వాత ఈవీఎంతో అనుసంధానం చేసిన వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) నుంచి ఒక రసీదు వంటిది వచ్చి కొన్ని క్షణాల పాటు కనిపించి తరువాత మూసి ఉన్న డబ్బాలోకి వెళ్లిపోతుంది. దీంతో ఓటర్ తాను ఎవరికి ఓటు వేశాడో నిర్ధారించుకోవచ్చు. పోలింగ్ అనంతరం నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను వీవీపీఏటీ ప్రింటవుట్ల ద్వారా ప్రింట్ అయిన పేపర్లతో లెక్క సరిచూసుకోవచ్చు. ఓటర్ల కోసమే ఫోటోలు ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలను ఉపయోగించాం. త్వరలో జరిగే రాజస్థాన్ ఉపఎన్నికల్లోనూ ఈ ఫొటోల విధానం అమలు చేస్తాం. వీటివల్ల ఒకే పేరుతో ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉండదు. – సంజీవ్ కుమార్, కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి -
ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫొటోలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: నిరక్షరాస్య ఓటర్లకు అనుకూలంగా ఉండేందుకు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లపై అభ్యర్థుల ఫొటోలను ఏర్పాటు చేసే సరికొత్త విధానాన్ని చెన్నై ఆర్కేనగర్లో ప్రవేశపెట్టినట్లు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజయ్ సక్సేనా శుక్రవారం చెప్పారు. పార్టీ ఎన్నికల చిహ్నంతోపాటు అభ్యర్థి పేరు, అతని ఫొటోలను ఈవీఎంలపై అమర్చడం వల్ల ఓటర్లకు సులువుగా అర్థం అవుతుందన్నారు. ఈవీఎంలో ఫొటోలను అమర్చే ప్రక్రియను కేంద్ర ఎన్నికల పరిశీలకులు జ్యోతికైలాష్ సమక్షంలో శుక్రవారం ప్రారంభించినట్లు ఆయన వివరించారు.