జాతీయ పార్టీకి అభ్యర్థులు కావలెను...!
గట్టుసింగారం (కూసుమంచి), న్యూస్‌లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారట...! ఈ విష యాన్ని ఆ పార్టీ నాయకులు తమ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికే నేరుగా చెప్పేశారు...!! ‘నిజమా...?! ఎప్పుడు.. ఎ క్కడ...’ అనేగా మీ ప్రశ్న..!
ఇది చదవండి...
కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం గట్టుసింగారం వచ్చారు. ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో సమావేశమయ్యారు. మండలంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ‘ఎంతమంది ఎంపీటీసీలను గెలిపిస్తార’ని ప్రశ్నించారు. దీనికి, సమాధానం చెప్పలేక పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు నీళ్లు నమిలారు. ఇంతలో కొందరు నాయకులు లేచి, పార్టీ మండల నాయకత్వ వైఫల్యాన్ని రాంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
17 ఎంపీటీసీ స్థానాలకుగాను ఐదుచోట్ల అసలు అభ్యర్థులనే పోటీకి పెట్టలేదని చెప్పారు. పార్టీలోని కొందరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది వినగానే.. రాంరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ‘పోటీలో పెట్టేందుకు అభ్యర్థులే దొరకలేదా..?’ అని, మండల నాయకులను నిలదీశారు. ‘ఇంత అభివృద్ధి చేసిన మనకు అభ్యర్థులు కరువా...? మండల నాయకులు సరిగ్గా ఉంటే ఇట్లానే ఉంటుందా..?’ అని, తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఇంతలో.. కొందరు నాయకులు ఆయన చెవిలో.. ‘మీడియా వాళ్లు ఉన్నార్సార్...’ అంటూ గుసగుసలాడారు.
ఆ నేత ఇదేమీ పట్టించుకోకుండా మరోసారి భగ్గుమన్నారు. ‘మీరు చేసిన పనికి ఇప్పుడు సిగ్గుపడడమెందుకు..? మీరేం చే స్తారో నాకు తెలీదు. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపిం చాలి. ఎంపీపీని కైవసం చేసుకోవాలి’ అని హుకుం జారీ చేశారు. సరేనంటూ నాయకులు తలలూపారు. కొద్ది క్షణాల తరువాత... ‘మీరు ఇట్లా చేస్తే.. అసలు నేను ఎమ్మెల్యేగా పోటీలోనే ఉండను..’ అంటూ, రాంరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు...! దీంతో, అక్కడున్న నాయకులంతా అవాక్కయ్యారు.