జనం గొంతుక... సాక్షి
► టీవీ ప్రసారాలు తక్షణం పునరుద్ధరించాలి
► అనంతలో జర్నలిస్టుల నిరసన
► అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన
అనంతపురం టౌన్ : జనం గొంతుకైన ‘సాక్షి’ మీడియాను నియంత్రించాలనుకోవడం మంచి పద్ధతి కాదని జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడ్డారు. తక్షణం టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓ టీవీ చానల్ ప్రసారాలు రాకుండా చేస్తే గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు ‘సాక్షి’పై కక్షకట్టడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ మీడియా ఎండగడుతోందని, దీన్ని జీర్ణించుకోలేక ముద్రగడ దీక్షను సాకుగా చూపి ఇలాంటి చర్యలు దిగడం మంచిది కాదని హితవు పలికారు.
మోసాలకు పాల్పడే వారి పట్ల మీడియా ఎప్పుడూ యుద్ధం చేస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించకుంటే ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రిటీష్ తరహా పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మీసార రంగన్న అన్నారు. కార్యక్రమంలో కదలిక ఎడిటర్ ఇమాం, ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్, జాప్ నేతలు రామాంజనేయులు, రవిచంద్ర, చలపతి, రామ్మూర్తి, జయరాం, సాయినాథరెడ్డి, చౌడప్ప, అనిల్‌కుమార్‌రెడ్డి, వీరశేఖరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, నగర యూత్ అధ్యక్షుడు మారుతీనాయుడు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.నరేంద్రరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.విద్యాసాగర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నపూస రామచంద్రారెడ్డి, నాయకులు గోపాలమోహన్, ఆర్.పురుషోత్తం, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.