నెలాఖరులో అమెరికాకు కేసీఆర్
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పిలుపు మేరకు వెళ్లనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ నెలాఖరులో అమెరికా వెళ్లనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆహ్వానం మేరకు సీఎం వెళుతున్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్‌లో టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ అలుగు నేతృత్వంలో దాదాపు పదిహేను మందితో కూడిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది.
ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ను అభినందించడంతో పాటు, ఆయనను అమెరికాకు ఆహ్వానించారు. ఈ మేరకు అమెరికా వెళుతున్న కేసీఆర్.. అక్కడ రెండు మూడు వారాలు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో అక్కడి పారిశ్రామికవేత్తలతో పాటు తెలంగాణకు చెందిన ఎన్నారైలతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలిసింది.
బంగారు తెలంగాణ కోసం ఎన్నారైల సహకారం కోరుతామని సీఎం ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాతృభూమిలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని తెలంగాణకు చెందిన ఎన్నారైలను ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం.
అమెరికా వెళ్లడానికి గాను కేసీఆర్ గురువారం అమెరికా కాన్సులేట్ నుంచి వీసా తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సీఎంతోపాటు ఎవరెవరు వెళతారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ పర్యటన క్రిస్మస్కు ముందా? తరువాతా? అన్నదానిపైనా ఇంకా నిర్ణయం జరగలేదని సీఎం సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.