Canteen facilities
-
అమ్మకానికి ట్విటర్ ఆఫీస్ వస్తువులు.. ఎలాన్ మస్క్ మరీ దిగజారిపోతున్నారా?
గత యాజమాన్యం ట్విటర్లో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి భోజనం ఖర్చు రూ.32వేలు కాగా.. ఏడాదికి 13 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మస్క్ ట్విటర్ బాస్‌గా తన మార్క్ చూపించుకునేందుకు తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టే ట్విటర్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ప్రతి వస్తువును వేలానికి పెట్టారు. ఆ వేలం జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలోని 265 కిచెన్ అప్లయెన్సెస్, ఆఫీస్ ఫర్నీచర్‌ను ఆక్షన్‌కు.. వాటిల్లో సింక్ లేకపోవడం గమనార్హం. ఇక ఈ వేలంలో ఒక్కో వస్తువు ప్రారంభం ధర 25డాలర్లుగా నిర్దేశించినట్లు వేలం నిర్వహించే శాన్‌డియోగో కేంద్రంగా ఉన్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్ వెల్లడించింది. వేలంలో ఉన్న వస్తువులు ఇవే మస్క్ వేలానికి ఉంచిన ట్విటర్ ఆఫీస్‌కు చెందిన వస్తువుల్లో ఆఫీస్ చైర్లు, ఎస్ప్రెస్సో మెషీన్లు, కాఫీ గ్రైండర్లు, స్టీమ్ టిల్టింగ్ కెటిల్స్, పిజ్జా తయారు చేసుకునే వస్తువులు, ఎలక్ట్రిక్/బేకరీ ఓవెన్లు, ఫ్రీజర్లు (బార్ రిఫ్రిజిరేటర్‌తో సహా), మొబైల్ హీటెడ్ క్యాబినెట్లు, ఐస్ మేకింగ్ మెషీన్లు, ఫ్రయ్యర్లు, లేజర్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. రోజుకు రూ.32 కోట్ల నష్టం వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) కథనం ప్రకారం.. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ ఆదాయం భారీగా పడిపోయింది. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడం..ప్రపంచ దేశాలకు దిగ్గజం కంపెనీలు ట్విటర్లో ఇచ్చే ప్రకటనల్ని నిలిపివేశాయి. దీంతో ట్విటర్ రోజు 4 మిలియన్ (రూ.32 కోట్లు) డాలర్ల నష్టం వాటిల్లినట్లు డబ్ల్యూఎస్‌జే తెలిపింది. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకేనా అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు మస్క్ ట్విటర్ బ్లూ లాంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో మాదిరిగా ఫ్రీగా కాకుండా.. ట్విటర్ సంస్థకు చెందిన క్యాంటిన్లో నచ్చిన ఫుడ్ తినాలంటే 8 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. ఇప్పుడు ఆఫీస్‌లో వినియోగించుకునే వస్తువుల్ని అమ్మకానికి పెట్టడంతో మస్క్ మరింత దిగజారుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.అయితే ఈవేలానికి ట్విటర్ ఆర్ధిక పరిస్థితులకు సంబంధం లేదని వేలం పనులు చూస్తున్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్కు చెందిన నిక్ డోవ్ తెలిపారు. -
‘పైసా ఇవ్వకుండా మాపై విమర్శలు సిగ్గుచేటు’
సాక్షి, అమరావతి : ప్రజలకు అతి తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడానికి ఉద్దేశించిన క్యాంటీన్ల కోసం ఒక్క పైసా ఇవ్వకుండా తమపై విమర్శలు చేయటం సిగ్గుచేటని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలను విమర్శించారు. భారీగా ప్రజాధనాన్ని వృథా చేశారు.. ఎన్నికల ముందు హడావుడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ క్యాంటీన్లపై ప్రతిపక్ష పార్టీ వ్యాఖ్యలను, ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం క్యాంటీన్ల పనితీరుకు సంబంధించి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్యాంటీన్ల నిర్మాణాలకు సంబంధించి దాదాపు రూ. 50 కోట్లు, పంపిణీ చేసిన ఆహారానికి సంబంధించి ఆరు నెలల బిల్లులు మరో రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉంచారని ధ్వజమెత్తారు. పేదలపై గత ప్రభుత్వానికి ఉన్న కపట ప్రేమకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా, కోట్ల రూపాయాల్లో అప్పుపెట్టి, పంచభక్షపరమాన్నాలు పెట్టినట్టుగా ప్రచారం చేసుకుందని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసి, ప్రతిపక్ష పార్టీ నాయకులు తమను విమర్శించటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కాకుండా అసలు రద్దీలేని చోట్ల, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అన్నట్టుగా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలోని క్యాంటీన్లలో సుమారు 68 క్యాంటీన్లు ప్రస్తుతమున్న చోటే ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు గుర్తించామని, మిగిలినవి ప్రజలకు చేరువగా లేని ప్రదేశాల్లో నిర్మించారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీటి నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించామన్నారు. ప్రజా ప్రయోజనాలతో పాటు, క్యాంటీన్లను వినియోగించే వారికి ఏవి అవసరమో, ఏ ప్రదేశాల్లో వీటి ఆవశ్యకత ఉందో అధ్యయనం చేసి కొత్తపాలసీని తీసుకుని వస్తామని తెలిపారు. క్యాంటీన్లను ప్రజలకు మరింత ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించిందని, వీటి నిర్వహణలో ఉన్న లోటుపాట్లని సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. క్యాంటీన్లను మూసివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, స్థల లభ్యత, నిర్వహణ వెసులుబాటు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు తీసుకుంటామన్నారు. -
పార్లమెంటు క్యాంటీన్ల ఖర్చు రూ.16 కోట్లు
ఇండోర్: పార్లమెంటులో 2017–18 ఆర్థిక సంవత్సరానికి క్యాంటీన్లను నిర్వహించినందుకు గానూ రూ.16.43 కోట్లు చెల్లించాలని ఉత్తర రైల్వే లోక్‌సభ సెక్రటేరియట్‌ను డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పార్లమెంటు హౌస్ ప్రాంగణం, పార్లమెంటు రిసెప్షన్, లైబ్రరీ బిల్డింగ్ వద్ద క్యాంటీన్ ఔట్లెట్లను ఏర్పాటు చేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది. వీటి నిర్వహణకు 2017–18 కాలానికి రూ.16,43,90,598 ఖర్చయిందనీ, దీన్ని వెంటనే చెల్లించాలని బిల్లును పంపింది. 2019, జనవరి 16 నాటికి కూడా ఈ మొత్తాన్ని చెల్లించలేదని పేర్కొంది. ఈ మొత్తం ఖర్చును ఉత్తర రైల్వే ‘సబ్సిడీ క్లెయిమ్–సిబ్బంది ఖర్చుల’ కింద చూపింది. కాగా, ఈ బిల్లును పరిశీలించేందుకు నోట్‌ను కేంద్ర ఆర్థికశాఖకు పంపినట్లు తేలింది. -
క్యాంటీన్‌పై కన్ను!
కరీంనగర్‌హెల్త్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన ఆహార పదార్థాలు అందించేందుకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. రోగులతోపాటు వారి బంధువులకు నాణ్యమైన భోజనం, బ్రెడ్, పాలు సరసమైన ధరలకు అందించడమే క్యాంటీన్ ఉద్దేశం. అయితే ఈ క్యాంటీన్ నిర్వహణను టెండర్లు పిలవకుండానే అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి పెద్ద ఆస్పత్రి కావడంతో రోజుకు వేయి మంది వరకు వస్తుండడంతో అందరి కళ్లు ఈ క్యాంటీన్‌పైనే పడ్డాయి. తమ అనుయాయులకే ఇప్పించుకునేందుకు గళ్లీస్థాయి లీడర్ల నుంచి మంత్రిస్థాయి ప్రజాప్రతినిధుల వరకు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తామేమి తక్కువ తిన్నామా అన్నట్లు ఆస్పత్రిలోని వైద్యులు సైతం తమ వారికి క్యాంటీన్ దక్కేలా యత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటి వరకు క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మాత్రమే ఆస్పత్రి స్టాండింగ్ కమిటీ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. క్యాంటీన్ నిర్వహణను ఎలా అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా ఆస్పత్రి పాతభవనంలో ఓ క్యాంటీన్ ఉండగా.. మరొకటి ఎందుకనే ప్రశ్న వస్తుంది. క్యాంటీన్ కోసం ఆస్పత్రిలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. లాభాల కోసమే.. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు నాణ్యమైన పదార్థాలు అందించేందుకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇదీ సేవ మాదిరిగానే చూడాలని వ్యాపార కోణంలో ఆలోచించవద్దని స్థానికులు కోరుతున్నారు. గత వారం నిర్వహించిన ఆస్పత్రి స్టాండింగ్ కమిటీ సమావేశంలో క్యాంటీన్ గురించి చర్చించకపోయినప్పటికీ.. పైరవీలు జోరందుకున్నట్లు చర్చ సాగుతోంది. వికలాంగులు, నిరుద్యోగ యువతకు ఇచ్చి నిర్వహణను మెరుగ్గా ఉండేలా చూడాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు. క్యాంటీన్ లేక ఇబ్బందులు మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది గడిచిపోయింది. అప్పటి నుంచి క్యాంటీన్ లేక రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలో రాత్రి, పగలు తేడాలేకుండా గర్భిణులు, బాలింతలు నెలల శిశువులతో ఆస్పత్రిలో చేరుతుంటారు. ప్రస్తుతం ప్రతీ రోజు 20కి తగ్గకుండా ప్రసవాలు జరుగుతుండగా, 30 నుంచి 40 మంది వరకు బాలింతలు, శిశువులు వైద్యసేవల కోసం ఆస్పత్రిలో చేరుతుంటారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగులకు పాలు, టీ, కాఫీ, బ్రెడ్, బిస్కట్‌తోపాటు పండ్ల రసాలు అందించాల్సి ఉంటుంది. కప్పు పాల కోసం రోగుల బంధువులు చాలా దూరం వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో పాల కోసం బస్టాండ్‌కు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉంటుందని, అక్కడి నుంచి తెచ్చుకునే క్రమంలో పాలకు రూ.10, ఆటోచార్జీలు రూ.50 ఖర్చు అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల దోపిడీ పాలు, చాయ్, బ్రెడ్ వంటి పదార్థాల కోసం బయటికి వెళ్తే షాపుల నిర్వాహకులు దోపడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని ఆహార పదార్థాలు, పాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని రోగులు బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని క్యాంటీన్ నిర్వహణను లాభార్జనతో కాకుండా సేవాభావంతో చూసే వారికి అప్పగించాలని డిమాండస్థానికంగా ఉంది. -
వ్యాపారం స్వీటు.. సమస్యలు ఘాటు
=అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను వేధిస్తున్న ఇబ్బందులు =ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనకాపల్లి, న్యూస్‌లైన్: సాలీనా రూ.150 కోట్ల టర్నోవర్ కలిగిన జాతీయ స్థాయి బెల్లం మార్కెట్ అది. రోజు వారీ ఆర్థిక లావాదేవీలతో రెగ్యులేటరీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా అదే. లావాదేవీల నేపథ్యంలో సెస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తున్నా ఆ మార్కెట్ యార్డుపై నిధులు ఖర్చు పెట్టేందుకు ప్రతిసారి ఏదో ఒక కొర్రియే. ఈ మార్కెట్లో నిత్యం పెద్దసంఖ్యలో రైతులు, వర్తకులు, కార్మికులు లావాదేవీల్లో పాల్గొంటారు. నల్లబెల్లం కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలో మూడు ఏర్పాటు చేయగా అందులో ఒకటి ఇక్కడే ఉంది. ఇలా అనేక ప్రాధాన్యతలు సంతరించుకున్న అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ సమస్యలతో సతమతమవుతోంది. అర్ధరాత్రి వరకు పనిచేసే ఇక్కడి కార్మికులకు క్యాంటీన్ సదుపాయం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతుల విశ్రాంతి కోసం నిర్మించిన రైతు భవనం మొక్కుబడిగానే కొనసాగుతుంది. విశ్రాంతి భవనాలను ఈ విభాగంతో సంబంధం లేని సిబ్బందికి తాత్కాలికంగా కేటాయించడంతో బెల్లం లావాదేవీల కోసం వచ్చే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంచినీటి కుళాయి దిమ్మల వద్ద అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. ఈ మార్కెట్‌యార్డులోకి ప్రైవేటు వ్యక్తుల సంచారం పెచ్చుమీరినా అరికట్టలేకపోతున్నారు. మార్కెట్‌యార్డుకు ఆనుకొని నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోనూ బయట వ్యక్తుల హవా కోనసాగుతోంది. రోజూ చెత్త తొలగింపు అరకొరగానే ఉంటోంది. మార్కెట్‌యార్డులో చేపలు కొనుగోలు కేంద్రాలు, రైతు బజార్ ఏర్పాటు చేయాలని భావించినా అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. మార్కెట్ కమిటీ ఎప్పటికప్పుడు అద్దె వసూలు చేయాల్సి ఉన్నా తాత్సారం జరుగుతోంది. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. ఇలా ఎన్నో సమస్యలతో అనకాపల్లి మార్కెట్‌యార్డు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.